నెరవేరుతున్నచొప్పదండి పట్టణ ప్రజల స్వప్నం
రేపు మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా సెంట్రల్ లైటింగ్, ఫుట్‌పాత్‌లకు శంకుస్థాపన
వ్యవసాయ మార్కెట్లో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం
ఇచ్చిన మాట నిలుపుకున్న ఎమ్మెల్యే రవిశంకర్
చొప్పదండి, మార్చి15: చొప్పదండి పట్టణ వాసుల కల నెరవేరబోతున్నది. నియోజకవర్గ కేంద్రంగా ఏర్పడి ఏండ్లు గడుస్తున్నా అభివృద్ధికి ఆమడ దూరంగా చీకట్లో మగ్గిన ఈ ప్రాంతం.. ఇప్పుడు ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ కృషితో ప్రగతి బాట పట్టింది. గత మున్సిపల్ ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం.. నాలుగు కిలోమీటర్ల మేర సెంట్రల్ లైటింగ్ సిస్టం, ఫుట్‌పాత్‌లు, సైడ్ డ్రైన్ల నిర్మాణానికి అనుకున్నదాని కంటే మూడు రెట్లు అధికంగా రూ.33కోట్లు మంజూరు చేయించగా, గురువారం మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా శంకుస్థాపనకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీంతోపాటే రూ.14కోట్లతో వ్యవసాయ మార్కెట్లో పూర్తిచేసిన పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం చేయబోతుండగా, పట్టణవాసుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. చొప్పదండి పట్టణ దశ మారబోతున్నది. ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ కృషితో మంజూరైన రూ.33కోట్ల అభివృద్ధి పనులతో కొత్తరూపు సంతరించుకోబోతున్నది. నాలుగు కిలోమీటర్ల మేర సెంట్రల్ లైటింగ్ సిస్టం, ఫుట్‌పాత్‌లు, సైడ్ డ్రైన్ల నిర్మాణానికి రేపు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేయబోతుండగా సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.
చొప్పదండి మొన్నటిదాకా మేజర్ గ్రామపంచాయతీగా ఉండేది. నియోజకవర్గ కేంద్రంగా ఏర్పడి ఏండ్లు గడిచినా జరిగిన అభివృద్ధి శూన్యం. మేజర్ జీపీగా ఉన్నప్పటి నుంచే సెంట్రల్ లైటింగ్ సిస్టం ఏర్పాటు ఇక్కడి ప్రజలకు కలగానే మిగిలిపోయింది. ఈ క్రమంలో మూడేళ్ల క్రితం మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ అయింది. తొలి ఎన్నికల్లో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే చొప్పదండిలో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు, మురుగు కాలువలు, ఫుట్‌పాత్‌ల నిర్మాణం, తదితర అభివృద్ధి పనులు చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొనడం, ‘నేను సైతం నా నగరం కోసం’ అంటూ ఎమ్మెల్యే సుంకె ఇంటింటా తిరిగి సమస్యలు తెలుసుకొని పరిష్కరిస్తానని మాట ఇచ్చారు. ఆ మేరకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు విన్నవించి సక్సెస్ అయ్యారు. తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా అనుకున్నదాని కంటే మూడు రెట్లు అధికంగా రూ.33 కోట్లు మంజూ రు చేయించారు. వీటితోపాటు బీటీ రోడ్ల నిర్మాణానికి రూ.1.50కోట్లు మంజూరు కావడంతో పట్టణ ప్రజలతో పాటు ప్రజాప్రతినిధులు, నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మొదటిసారిగా మున్సిపల్‌కు మంత్రి కేటీఆర్
చొప్పదండి మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ అయిన తర్వాత మొదటిసారిగా చొప్పదండికి ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ రాబోతున్నారు. ఝాన్సీ విద్యాలయం నుంచి నవోదయ దాకా 4 కిలోమీటర్ల మేర రూ.33కోట్ల వ్యయంతో సెంట్రల్‌లైటింగ్, సైడ్ డ్రైన్లు, ఫుట్‌పాత్‌ల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. అలాగే చొప్పదండి వ్యవసాయ మార్కెట్ ఆవరణలో పూర్తయిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. అనంతరం జడ్పీ బాలుర పాఠశాల క్రీడామైదానంలో ఏర్పాటు చేసే బహిరంగసభలో పాల్గొంటారు. మంత్రి పర్యటన సందర్భంగా ప్రజాప్రతినిధులు, నాయకులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.
విజయవంతం చేయండి..
చొప్పదండి నియోజకవర్గ కేంద్రంగా ఏర్పడి ఇన్నేళ్లు గడిచినా అభివృద్ధిలో మాత్రం ముందుకెళ్లలేదు. గత మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం సెంట్రల్‌లైటింగ్, మురుగుకాలువ, స్మార్ట్ వాటర్ డ్రైన్స్, ఫుట్ పాత్ల నిర్మాణానికి గురువారం శంకుస్థాపన చేసుకోబోతుండడం సంతోషంగా ఉంది. జడ్పీ పాఠశాల మైదానంలో నిర్వహించే బహిరంగ సభకు నియోజకవర్గంలోని ఆరు మండలాల ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలి.
మార్కెట్ అభివృద్ధి..
ఎమ్మెల్యే సుంకె సహకారంతోనే చొప్పదండి వ్యవసాయ మార్కెట్ అభివృద్ధి అవుతున్నది. 2020-22లో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ సహకారంతో రూ.14.2 కోట్లతో అభివృద్ధి పనులు పూర్తి చేశాం. అంతేకాకుండా ప్రజల సౌకర్యార్థం ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఏర్పాటుకు వ్యవసాయ మార్కెట్‌కు సంబంధించిన రెండెకరాల స్థలాన్ని ఇచ్చాం. గురువారం మున్సిపల్ శాఖ మంత్రి మార్కెట్లో నిర్మించిన ఎడ్లబండి స్లాబ్, పబ్లిక్ టాయిలెట్స్, నూతనంగా నిర్మించిన కార్యాలయ భవనం, అసైన్ట్ ల్యాబ్, కవర్‌షెడ్డు, క్యాంటీన్ బిల్డింగ్‌లను ప్రారంభిస్తారు.
– ఆరెల్లి చంద్రశేఖర్‌గౌడ్, మార్కెట్ చైర్మన్
ఎమ్మెల్యే కృషి మరువలేనిది..
చొప్పదండి పట్టణ అభివృద్ధికి రూ.33కోట్ల నిధుల మంజూరుకు ఎమ్మెల్యే సుంకె చేసిన కృషి మరువలేనిది. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఎమ్మెల్యే తరచూ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ వద్దకు వెళ్లి నిధులు ఇవ్వాలని పట్టుబట్టి సాధించారు. రూ.33కోట్లు మంజూరుకావడం చాలా సంతోషంగా ఉంది.
– గుర్రం నీరజ, చొప్పదండి మున్సిపల్ చైర్పర్సన్