Tummala | కరీంనగర్ కలెక్టరేట్, జూన్ 22: గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన అనుభవంతో కరీంనగర్ సమగ్రాభివృద్ధికి జిల్లా ఇంచార్జిగా నియమితులైన వ్యవసాయశాఖామాత్యులు తుమ్మల నాగేశ్వర్రావు సహకరించాలని, మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కోరారు. ఇంచార్జి బాధ్యతలు తీసుకున్న అనంతరం మొదటిసారిగా జిల్లాకు విచ్చేసిన మంత్రి తుమ్మల వ్యవసాయం, విద్య, గృహనిర్మాణం, పంచాయితీరాజ్ శాఖల పనితీరుపై ఉమ్మడి జిల్లాలోని కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులు, ఎమ్మెల్యేలు, మంత్రులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ, దక్షిణ భారతదేశంలోనే మొదటిసారిగా జిల్లా కేంద్రంలో నిర్మించిన తీగెల వంతెన నిర్వహణపై నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని, డైనమిక్ లైట్ల వినియోగం లేకపోవటంతో వంతెన కల కోల్పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. బిల్లుల చెల్లింపులో జాప్యం వెనుక గల కారణాలపై ఆరాతీయాలన్నారు.
మానేరు రివర్ ఫ్రంట్ నిర్మాణ పనుల్లో కూడా వేగం లోపించిందని, గత కొద్ది నెలలుగా ఈ పనులు మందకోడిగా సాగుతున్నాయన్నారు ఈరెండు ప్రభుత్వాదానికి ఆదాయవనరులైనా, సత్వరమే పూర్తి చేయటంపై నిర్లక్ష్యం వహించటం సముచితం కాదన్నారు. సకాలంలో నిర్మాణాలు పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టకపోవటం, ప్రభుత్వాదాయ మార్గాలపై చిన్నచూపు చూడటమేనన్నారు. గత ప్రభుత్వంలో రహదారులు, భవనాల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన క్రమంలో అనేక రహదారుల నిర్మాణానికి అనుమతులు మంజూరు చేశారని గుర్తు చేశారు. అలాగే, అనంతర కాలంలో కూడా మంజూరైన రోడ్ల పనుల్లో కొన్ని పూర్తికాగా, మరో 125 వరకు రహదారులు అసంపూర్తిగా ఉన్నాయని, సిఎం అస్యూరెన్స్ కింద విడుదలైన రూ.350 కోట్లు సరిపోకపోవటంతో, మిగతా రహదారుల పనులు పూర్తికాలేదన్నారు. వెంటనే వీటికి నిధులు విడుదల చేసి, వచ్చే సమావేశం నాటికి పూర్తి చేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు.
ఆయిల్ ఫామ్ తోటల పెంపకంపై రైతుల్లో ఇప్పటికీ సరైన అవగాహన కల్పించటంలో అధికారయంత్రాంగం. వైఫల్యం చెందుతోందన్నారు వాటర్ హబ్ గా మారిన అనంతరం ఉమ్మడి జిలా వరిసాగులో ఉభయ గోదావరి జిల్లాలను వెనకకు నెట్టినా, అయిల్‌ఫామ్ సాగుతో కలిగే లాభాలపై రైతులకు వివరించలేకపోతుందన్నారు. మూడేళ్ళ అనంతరమే పంట దశకు వచ్చే ఆయిల్ ఫామ్ తోటలు మూడేళ్ళలో ఎకరా భూమిలో వరిసాగు చేస్తే వచ్చే లాభం కన్నా రెండింతలు ఒకేసారి వస్తుందనే అంశంపై ప్రత్యేకంగా దృష్టిసారించాలని సూచించారు. పంట కాత దశకు వచ్చే దాకా మాత్రమే పెట్టుబడి పెట్టాల్సి ఉంటుందని, ఆనంతరం ముప్పై ఏళ్ళ వరకు ఎలాంటి పెట్టుబడి లేకుండా టన్నుల కొద్ది గెలలు పొందవచ్చనే అంశాన్ని రైతులకు తెలియజేస్తే ఫామాయిల్ తోటల పెంపకం వైపు రైతులు మళ్ళే అవకాశాలుంటాయన్నారు.
జిల్లాలో కోతకొచ్చిన ఆయిల్ ఫామ్ గెలలు కోయటంలో కూడా సరైన శిక్షణ ప్రభుత్వం ఇవ్వాల్సిన అవసరముందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఎడిబుల్ ఆయిల్ అత్యధికంగా దిగుమతి చేసుకునే దేశాల్లో భారతదేశం మొదటగా ఉంటుందని, ఏటా 1.35 లక్షల టన్నుల పామాయిల్ దిగుమతి చేసుకుంటున్నట్లు గణాంకాలు తెల్పుతున్నాయన్నారు. దేశంలోనే ఆయిల్ పామ్ మొక్కలు పెంచితే దిగుమతి, ధరలు కూడా తగ్గుతాయన్నారు. అనంతరం మొదటిసారిగా జిల్లాకు వచ్చిన మంత్రి తుమ్మలకు శాలువా కప్పి, సన్మానించారు.
విద్యాశాఖ పనితీరుపై మంత్రి పొన్నంతో సహా ఎమ్మెల్యేల అసంతృప్తి
ఉమ్మడి జిల్లాలో విద్యాశాఖ తీరుపట్ల మంత్రి పొన్నం ప్రభాకర్‌తో పాటు ఎమ్మెల్యేలు కల్వకుంట సంజయ్, కవ్వంపల్లి సత్యనారాయణలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు కేవలం అంకెల ప్రకటనలకు మాత్రమే అధికారులు పరిమితమయ్యారని, నాణ్యమైన విద్యను అందించటంలో యంత్రాంగం వైఫల్యం చెందుతోందని విమర్శించారు. తన నియోజకవర్గంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో తనిఖీలు చేపట్టిన సందర్భంలో పదో తరగతి చదివే విద్యార్థి 5వతరగతి పుస్తకాలు చదవలేకపోతుండటాన్ని గ్రహించినట్లు మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ వ్యాఖ్యానించటంతో, వేదికపై ఉన్న ఎమ్మెల్యేలు, కలెక్టర్లు ఒక్కసారిగా అవాక్కయ్యారు.
జిల్లాలో విద్యాశాఖ ప్రగతిపై మాట్లాడుతున్న కరీంనగర్ డిఈవో మొండయ్యపై మంత్రి పొన్నం సెటైర్లు వేశారు. కాగితాలపై ఉన్న ప్రగతి కాదు. క్షేత్రస్థాయిలో చేపట్టే పరిశీలనపై వివరాలు వెల్లడించాలని అడగటంతో డిఈవో మిన్నకుండిపోయారు. విద్యారంగం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి, అత్యధిక నిధులు వెచ్చిస్తుండగా, వారికి నాణ్యమైన విద్య అందించటంలో యంత్రాంగం నిర్లక్ష్యం వహిస్తుండటం సముచితం కాదన్నారు.
సమీక్ష సమావేశంలో వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, ఐటి మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబుతో పాటు ఎమ్మెల్యేలు చింతకుంట విజయరమణారావు, మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి సత్యనారాయణ, మక్కాన్్సంగ్జాకూర్,ఆది శ్రీనివాస్‌లు మాట్లాడారు. ప్రభుత్వ సలహాదారు హర్కార్ వేణుగోపాల్, జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లయ్య, కరీంనగర్ మున్సిపల్ కమీషనర్ ప్రపుల్ దేశాయ్, జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్, పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష, సిరిసిల్ల కలెక్టర్ సందీప్‌కుమార్, అదనపు కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, లక్ష్మి కిరణ్, ఆర్డీవో మహేశ్వర్, ఆర్టీఏ సభ్యుడు పడాల రాహుల్, జనక్ ప్రసాద్, సత్యనారాయణతో పాటు ఉమ్మడి జిల్లాలోని వ్యవసాయ, అనుబంధ శాఖలు, విద్య, గృహ నిర్మాణ శాఖల ఉన్నతాధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.