Ramagundam | కోల్ సిటీ, సెప్టెంబర్ 21 : రామగుండం నగర పాలక సంస్థలో అక్రమార్జన పాలన సాగుతుందని, పారిశుధ్య వాహనాల కొనుగోళ్లలో వాస్తవ లెక్కలు తేల్చాలనీ, రూ.కోట్ల ప్రజాధనంతో కొనుగోలు చేసి ఏడాది తిరక్కముందే మరమ్మతుల పేరిట చెత్త కుప్పలకు తరలించడం పకడ్బందీగా జరుగుతుందని 41వ డివిజన్ కార్పొరేటర్ మార్కపురి సూర్య ఆరోపించారు. కార్పొరేటర్లకు రూ.30 లక్షలతో కొత్తగా సెల్ ఫోన్లు కొనివ్వడం కాదనీ, ఆ నిధులను ఉచిత అంత్యక్రియలకు కేటాయిస్తే ప్రజలు సంతోషిస్తారని సూచించారు. ఈమేరకు నగర పాలక కార్యాలయం ఆవరణలో మూలకు పడేసిన విలువైన వాహనాల వద్ద నిరసన తెలిపారు. ఆయన మాట్లాడుతూ పాలకులు, అధికారులు జేబులు నింపుకునే ఎజెండాలను తిరస్కరిస్తున్నట్లు తెలిపారు. కార్పొరేషన్ లో జరుగుతున్న ప్రతీ అవినీతిని ప్రజలు గమనిస్తున్నారనీ, ఈ పాలక వర్గం ఆ చెడ్డ పేరు తెచ్చుకోవద్దని హితవు పలికారు.
కార్పొరేషన్ లో జరుగుతున్న అక్రమాలపై ఎవరు ప్రశ్నించినా దున్నపోతుపై వాన పడ్డ చందంగా అధికారులు, పాలకుల వైఖరి మారిందని విమర్శించారు. రూ.2 కోట్ల వ్యయంతో అత్యాధునిక పారిశుధ్య యంత్రాలను కొనుగోలు చేసి కార్యాలయంకు తీసుకరాకుండా పక్కదోవ పట్టించే కుట్ర జరిగిందనీ, తీరా ప్రజా సంఘాల పోరాటంతో ఏడాది తర్వాత నాసిరకం వాహనాలను తీసుకవచ్చి చూపించారని గుర్తు చేశారు. ప్రజా సొమ్ము చెట్ల పొదల్లో నిరుపయోగంగా ఉంటే కమిషనర్, మేయర్లకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ప్రతి రోజూ ఉదయం కాలువ పూడికతీత పేరుతో ప్రజల దృష్టిని మళ్లిస్తున్నారని ఆరోపించారు. రూ.65 లక్షలతో కొనుగోలు చేసిన స్వీపింగ్ మిషన్ నిరుపయోగంగా పడేసి ఉందన్నారు.
రూ.60 లక్షలతో కొనుగోలు చేసిన ట్రక్ మౌంటెడ్ గార్బేజ్ కంపాక్టర్ అనే రెండు వాహనాల్లో ఒకదాన్ని మరమ్మతుల పేరిట చెట్ల పొదలకు తరలించారని పేర్కొన్నారు. అలాగే చెత్త సేకరణలో కీలకమైన స్టాటిక్ కంపాక్టర్ యంత్రం రూ.70 లక్షలతో కొనుగోలు చేసి ఎవరికీ కనిపించని దూరంలో గౌతమి నగర్లో నిరుపయోగంగా పడేశారని తెలిపారు. ఈ విధంగా రూ.కోట్ల వ్యయంతో కొనుగోలు చేసిన పారిశుధ్య వాహనాలను మరమ్మతు పేరిట చెట్ల పొదల్లో ఎందుకు పడేశారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజాధనంను దుర్వినియోగం చేస్తున్న పాలకులు, అధికారుల బండారం బయటపెడుతామని హెచ్చరించారు.