Thimmapur | తిమ్మాపూర్, సెప్టెంబర్ 7 : లోయర్ మానేరు జలాశయం పరిధిలోని అటవీ సంపద నరుక్కుపోతున్నా అటవీశాఖ అధికారులు పట్టనట్టు ఉండడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో రెండు, మూడు సార్లు రామకృష్ణకాలనీ గ్రామ పంచాయతీ పాలకవర్గం చొరవ తీసుకుని కలప అక్రమ రవాణాదారులను అడ్డగించి అధికారులకు పట్టించారు. అయినప్పటికీ అధికారులు పర్యవేక్షణ చేస్తుండకపోవడంతో మళ్లీ ఆదివారం సాయంత్రం ట్రాక్టర్లో తుమ్మ కలప తరలిస్తున్న ట్రాక్టర్ను రామకృష్ణకాలనీ పాలకవర్గం అడ్డుకుని పంచాయతీ కార్యాలయానికి తరలించారు.
అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి. ఉన్న కొద్దిపాటి అడవిని కాపాడాలని పాలకవర్గ సభ్యులు కోరుతున్నారు. సర్పంచ్ గుజ్జుల శ్వేతప్రణీత్రెడ్డి, ఉపసర్పంచి పోలం మల్లేష్, వార్డు సభ్యులు కొమ్మెర వెంకట్రెడ్డి, రొడ్డ శ్రీకాంత్, నాయకులు దాడి ఓదేలు, మాచర్ల అనిల్, మాచర్ల శ్రీనివాస్, కవ్వంపల్లి అంజి తదితరులు పాల్గొన్నారు.