కరీంనగర్ నగరపాలక సంస్థలో ఏటా అక్రమ నల్లా కనెక్షన్ల సంఖ్య పెరుగుతూనే ఉన్నది. వీటిని కట్టడి చేయాలన్న పేరుతో ఇంజినీరింగ్ అధికారులు ప్రతి ఏటా సర్వే చేపడుతున్నా ఫలితం ఉండడం లేదు. పైగా అక్రమ కనెక్షన్లను సక్రమం చేసుకోడానికే ఈ సర్వే చేస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Municipal Water | కరీంనగర్ కార్పొరేషన్, డిసెంబర్ 27 : కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో నల్లాల అక్రమ కనెక్షన్లు లేకుండా చేయడంతోపాటు ప్రతి ఇంటికీ నల్లా కనెక్షన్ ఉండాలన్న ఉద్దేశంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం 100కే కనెక్షన్ ఇచ్చింది. అయినా, అక్రమ నల్లాల విషయంలో బల్దియాలోని ఇంజినీరింగ్ అధికారులు, సిబ్బంది అడ్డదారిలో వసూళ్ల దందాగా మార్చుకుంటున్నట్టు తెలుస్తున్నది. కనెక్షన్ల మంజూరు విషయంలో కాగితాలపై అనేక నిబంధనలు పెట్టిన ఉన్నతాధికారులు.. క్షేత్రస్థాయిలో మాత్రం పట్టింపు లేన్నట్టుగానే వ్యవహరిస్తున్నారు. దీంతో ప్రజలు కూడా అక్రమ కనెక్షన్లు ఇచ్చిన తర్వాత ఆ అధికారులే దానిని సక్రమం చేస్తారు కదా..? అన్నట్టు పరిస్థితి మారింది. దీంతో నగరపాలక సంస్థ ఆదాయానికి గండిపడుతున్నది.
నగర ప్రజలకు ఎంతో కీలకమైన మంచినీటి సరఫరా విభాగంలో కాంట్రాక్టు, ఎన్ఎంఆర్ సిబ్బందిదే పెత్తనం సాగుతున్నట్టు తెలుస్తున్నది. ముఖ్యంగా ఆయా రిజర్వాయర్ల వారీగా డీఈ, ఏఈలున్నా క్షేత్రస్థాయిలో పర్యటించి పనులు చేపట్టడం లేదని, నల్లా కనెక్షన్ల ఫైల్స్‌పై సంతకాలు చేయడమే తప్ప పరిశీలన ఉండడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా కనెక్షన్లు అందించే విషయంలో అంతా కాంట్రాక్టు సిబ్బందిదే నడుస్తుందని, ఎక్కువగా గుంతలు తవ్వే కూలీలే నేరుగా కనెక్షన్లు ఇస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో మెయిన్ పైపులైన్లకు నిబంధనలకు మించి కనెక్షన్ల సంఖ్య ఉన్నట్టు సమాచారం. కమర్షియల్ నల్లాలు ఉండాల్సిన ప్రాంతంలో గృహ అవసరాల కనెక్షన్లు, అపార్ట్మెంట్లకు నిబంధనలకు విరుద్ధంగా సైజు మార్చి కనెక్షన్లు ఇచ్చారన్న విమర్శలున్నాయి. ఈ దందాలో కింది స్థాయి సిబ్బంది నుంచి డీఈ స్థాయి అధికారి వరకు ముడుపుల దందా నడుస్తున్నదన్న ఆరోపణలున్నాయి.
నగరపాలక సంస్థలో ఏటా ఏదో సమయంలో అక్రమ నల్లా కనెక్షన్ల సర్వే పేరిట ఇంజినీరింగ్ అధికారులు పనులు చేపడుతున్నారు. సుమారు నెల పాటు ఈ సర్వే చేస్తూ, అక్రమాలను గుర్తిస్తే వాటిని క్రమబద్ధీకరించేలా చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా అక్రమ నల్లా కనెక్షన్లు ఎలా ఇస్తున్నారన్న విషయంపై మాత్రం దృష్టి పెట్టటం లేదు. అయితే ఏ విభాగం సిబ్బందిపై అయితే ఆరోపణలు వస్తున్నాయో అదే విభాగంతోనే సర్వే పనులు చేయిస్తుండడం ఆరోపణలకు తావిస్తున్నది. ఆ కారణంగానే అక్రమం కాస్తా సక్రమం అవుతున్నదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
నగరంలోని హైలెవల్ జోన్ నీటి సరఫరా విభాగంలో పని చేస్తున్న ఫిట్టర్ దానయ్యపై అక్రమ నల్లా కనెక్షన్లు, ఇతర విషయాలపై కార్పొరేటర్ రాపర్తి విజయ ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేశారు. దాంతో ఆయనను అక్కడి నుంచి బదిలీ చేస్తూ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, ముందస్తుగా అక్రమ నల్లా కనెక్షన్లపై సర్వే చేయడంతోపాటు సంబంధిత ఏరియాల సిబ్బంది, అధికారులపై చర్యలు తీసుకోవాలని కార్పొరేటర్లు డిమాండ్ చేస్తున్నారు. చర్యలు లేకుండా ఏటా సర్వేల వల్ల ఫలితం ఏముంటుందన్న అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.