Illegal construction | వేములవాడ, జూలై 6 : వేములవాడ పట్టణంలోని రెండో బైపాస్ రహదారి విద్యానగర్లోని కాలువను ఆనుకొని నిర్మిస్తున్న ప్రహరీ గోడను అధికారులు సోమవారం కూల్చివేశారు. కోనాయపల్లి చెరువు ముత్తడి ద్వారా వచ్చే వరద కాలువ బఫర్ జోన్ కబ్జా చేసి ప్రహరి గోడలు నిర్మించారు. ‘నమస్తే తెలంగాణ’లో ‘కాలువ కబ్జా’ అనే కథనం ప్రచురితమైంది. ఈ కథనానికి అధికారులు స్పందించి క్షేత్రస్థాయిలోకి చేరుకొని సోమవారం పరిశీలించారు.
కాలువ బఫర్ జోన్ లోకి నిర్మాణాలు జరిగినట్లుగా గుర్తించి 30 అడుగుల మేర నిర్మించిన ప్రహరి గోడను కూల్చివేశారు. ప్రభుత్వ కాల్వలను ఆక్రమించి నిర్మిస్తే కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా నిర్మాణాలను తొలగిస్తామని అధికారులు హెచ్చరించారు. ఇక్కడ అధికారులు తహసీల్దార్ జయంత్ కుమార్, పట్టణ ప్రణాళిక అధికారి అభినవ్, టీపీబీవో వినోద్, ఇరిగేషన్ ఏఈ సాయి తదితరులు ఉన్నారు.