Chandurthi | చందుర్తి, జులై 23 : గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ తరగతుల నిర్వహణకు కృషి చేసింది. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు సాంకేతికతను పెంపొందించి నూతన విద్యా విధానాలను అందించింది. దేశంలో ఎక్కడా లేనివిధంగా ప్రభుత్వ పాఠశాలలో సుమారు రూ.3లక్షలు విలువ చేసే (ఐఎఫ్ పీ) ఇంటరాక్ట్ ప్లాట్ ప్యానెల్ బోర్డులతో పాటు వాటి నిర్వహణకు ఇన్వైటర్లను అందజేసింది. అందులో భాగంగా చందుర్తి మండలంలోని పది జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు విద్యార్థుల సంఖ్యను బట్టి సుమారు 10 (ఐఎఫ్ పీ) బోర్డులను అందజేశారు.
ఇటీవల కిష్టంపేట జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థులు లేక మూతపడగా అందులోని (ఐఎఫ్ పీ) ఇంటరాక్ట్ ప్లాట్ ప్యానెల్ బోర్డు, ఇన్వైటర్లు మండల విద్యా వనరుల కేంద్రంలోని స్టోర్ రూమ్ లో మూలన పడేశారు. మూతబడ్డ పాఠశాలలో సిబ్బందిని సర్దుబాటు చేసిన అధికారులు విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించే పరికరం పక్కన బెట్టడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. నిరుపయోగంగా ఉన్న వస్తువులను వినియోగంలోకి తెచ్చి విద్యార్థులకు అందజేస్తే ఎంతో మేలు చేకూరుతోంది. ఈ విషయమై ఎంఈవో వినయ్ కుమార్ ను వివరణ కోరగా విద్యార్థుల సంఖ్యను బట్టి మరో పాఠశాలలో వినియోగించేందుకు చర్యలు చేపడతామని తెలిపారు.