Tatikonda Rajaiah | లింగాల గణపురం : కేంద్ర మంత్రి పదవి వస్తుందంటే వెన్నుపోటు పొడిచే అలవాటు ఉన్న కడియం శ్రీహరి తన కూతురు కావ్య తో సహా ఆయన మళ్లీ కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచి బీజేపీలో చేరడం ఖాయమని స్టేషన్‌ఘన్‌పూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య ఆరోపించారు. లింగాల గణపురంలో సోమవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఓ పక్క అప్పు పుట్టడం లేదని, తనను చెప్పులు ఎత్తుకెళ్లే దొంగలా కేంద్రం చూస్తోందని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటిస్తుంటే.. ఇక్కడ కడియం శ్రీహరి మాత్రం నియోజకవర్గానికి రూ.కోట్లాది తీసుకొచ్చి అభివృద్ధి చేస్తున్నానని కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారన్నారు. రాజకీయంగా భిక్ష పెట్టిన ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పోడిచి చంద్రబాబు చంకన చేరాడని, ఆ సమయంలో రామారావుపై చెప్పులు విసిరిన ఘనుడు కడియం అని అన్నారు.
ఆ తర్వాత మంత్రి పదవులు ఇచ్చిన చంద్రబాబును కాదని ద్రోహం చేసి బీఆర్ఎస్లో చేరాడని పేర్కొన్నారు. ఇక్కడ కూడా కేసీఆర్ ఎంపీగా, ఎమ్మెల్సీగా, డిప్యూటీ సీఎంగా కూతురుకు ఎంపీ టికెట్ ఇచ్చిన తర్వాత కాంగ్రెస్‌కు రూ.200 కోట్లకు అమ్ముడుపోయి కేసీఆర్‌కు కడియం ద్రోహం చేశాడని మండిపడ్డారు. ఈసమావేశంలో టిఆర్ఎస్ నాయకులు బసవ గాని శ్రీనివాస్ గౌడ్, చౌదర పెళ్లి శేఖర్, ఎదునూరి వీరన్న, దుంబాల భాస్కర్ రెడ్డి, గండి యాదగిరి, ఒడుగుల భాగ్యలక్ష్మి, గట్టగల శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.