Koppula Eshwar | కోల్ సిటీ, సెప్టెంబర్ 22: అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టేనని.. రామగుండం నియోజక వర్గ ప్రజలపై అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని రాష్ట్ర మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ స్నేహలత దంపతులు పేర్కొన్నారు. దుర్గా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా గోదావరిఖని జవహర్ నగర్ లో గల శ్రీ జయ దుర్గా దేవి ఆలయంలో సోమవారం శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి.
ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాపకులు, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ స్నేహలత దంపతులు ముఖ్య అతిథిగా హాజరై అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక హోమం నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణాల మధ్య అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. దుర్గా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను నియోజకవర్గ ప్రజలు, భక్తులు నియమ నిష్ఠలతో ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, వీహెచ్ఆర్ ఫౌండేషన్ అధినేత వ్యాల హరీష్ రెడ్డి, పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం పలువురు భక్తులు అమ్మవారి మాలను ధరించారు.
అలాగే రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో దేవీ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా పలు ఉత్సవ కమిటీల ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా ప్రారంభించారు. ముందు రోజు అమ్మవారి ఆగమనం చేసిన ఉత్సవ కమిటీల సభ్యులు సోమవారం అమ్మవార్లను భారీ ఊరేగింపుగా తీసుకువచ్చి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపాలు ప్రతిష్టించారు. మహిళలు, భక్తులు, చిన్నారులు అమ్మవార్ల సన్నిధిలో ప్రత్యేక పూజలు చేసి భక్తిశ్రద్ధలతో కొలిచారు. మొదటిరోజు అమ్మవారు బాలా త్రిపుర సుందరి దేవిగా దర్శనం ఇవ్వగా, గోదావరిఖనిలో దాదాపు వందకు పైగా మండపాల్లో ఉత్సవమూర్తులను ప్రతిష్టించారు.