KARIMNAGAR CPM | మానకొండూర్ రూరల్, ఏప్రిల్ 2: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్య హక్కులను హరిస్తే రానున్న కాలంలో పతనం కాక తప్పదని, సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు సుంకరి సంపత్ హెచ్చరించారు.
ఆ పార్టీ మండల కార్యకర్తలతో కలిసి హైదరాబాద్లో హెచ్సీయూ వద్ద జరిగిన ఆందోళనలో పాల్గొన్న నాయకులపై లాఠీ చార్జీ, అక్రమంగా అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ ఫ్లకార్డ్స్తో సదాశివపల్లిలో బుధవారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సంపత్ మాట్లాడుతూ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ప్రజాస్వామ్యాన్ని కాపాడుతామని, ప్రజలు తమ హక్కుల కోసం నిరసన తెలియజేసే హక్కు ఉంటుందని, నిరసన తెలియజేయడం రాజ్యాంగం కల్పించిన హక్కు అనే విషయాన్ని మర్చిపోయి, అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తుందన్నారు.
ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే హెచ్సీయూలోని 400 ఎకరాల భూమిని దేశ వ్యాప్తంగా మేధావులను తయారు చేసే యూనివర్సిటీ అభివృద్ధి కోసం కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి శాతరాజు భద్రయ్య, నాయకులు గట్టు సతీష్, పిట్టల సంపత్, రాములు తదితరులు పాల్గొన్నారు.