మంథని, ఏప్రిల్ 30 : రాష్ట్ర ప్రభుత్వం దళిత బంధు నిధులను వెంటనే విడుదల చేయాలని, లేని పక్షంలో మంథని నియోజవకర్గంలోని కాళేశ్వరం నుంచి 100 డప్పులతో హైదరాబాద్ వరకు పాదయాత్ర నిర్వహిస్తామని నియోజకవర్గ దళితబంధు సాధన ఐక్య పోరాట సమితి డివిజన్ అధ్యక్షుడు శ్రీనివాస్, నియోజకవర్గ కో-ఆర్డినేటర్ గద్దెల శంకర్ స్పష్టం చేశారు. మంథని ప్రెస్ క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. మంథని నియోజకవర్గంలో రెండో విడుత దళితబంధు 1100 మందికి మంజూరు చేసి కలెక్టర్ ఎంపిక చేశారని, ఎంపికైన దళితులకు గత ప్రభుత్వం ఈ నిధులు విడుదల చేసి కలెక్టర్ అకౌంట్లో జమ చేసిందని గుర్తు చేశారు. ఫ్రీజింగ్లో ఉన్న అమౌంట్‌ను లబ్ధిదారులకు జమ చేయాలని జీవో జారీ చేసినప్పటికీ మంథని నియోజకవర్గంలో దళితులకు నిధులు విడుదల చేయడం లేదన్నారు.
రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబును కలిసి వినతి పత్రం సమర్పించాని, పార్టీలకతీతంగా దళితులను లక్షాధికారులను చేసేందుకు దళితబంధు నిధులు విడుదల చేయాలని కోరారు. రెండో విడుత లబ్ధిదారులుగా ఎంపికైన వారికి స్థానిక సంస్థల ఎన్నికల్లోగా నిధులు విడుదల చేయాలన్నారు. లేని పక్షంలో కాళేశ్వరం నుంచి హైదరాబాద్ వరకు పాదయాత్ర నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో దళితబంధు సాధన సమితి ఉపాధ్యక్షుడు ఆర్ల స్వామి, డివిజన్ నాయకులు పోయిల తిరుపతి, డివిజన్ నాయకులు గడ్డం లక్ష్మీనారాయణ, జూల రమేశ్ పాల్గొన్నారు.