హుజూరాబాద్ టౌన్, మార్చి 29 : నియోజకవర్గంలోని రెండు మున్సిపాలిటీలతో పాటు, 107 గ్రామాలకు ఎలాంటి నీటి సమస్య రాకుండా చూసుకోవాలని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అధికారులకు సూచించారు. శనివారం స్థానిక కేసీ క్యాంపులో గల ఎమ్మెల్యే కార్యాలయంలో మిషన్ భగీరథ అధికారులతో సమావేశమై మాట్లాడారు.
తెలంగాణ ఏర్పాటు తర్వాత ప్రజలకు నీటి సమస్య ఉండకూడదని ఒకవైపు కాళేశ్వరం వంటి మహత్తరమైన ప్రాజెక్ట్ కట్టి, మరోవైపు మిషన్ కాకతీయతో రైతాంగానికి నీళ్లు అందించిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని, అలాగే తాగునీటి సమస్యను పూర్తిస్థాయిలో నిర్మూలించేందుకు మిషన్ భగీరథతో రాష్ట్రంలోని ప్రతీ ఇంటికి స్వచ్ఛమైన నీళ్లు అందించిన మహనీయుడని కొనియాడారు.
కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏనాడూ ప్రజలకు నీటి సమస్య రాలేదని, ఇప్పుడు కూడా అలా రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. నియోజకవర్గంలో ఏయే ప్రాంతాల్లో నీటి సమస్య ఎకువ ఉందో ఆ ప్రాంతాలను గుర్తించి వెంటనే పరిషరించాలని సూచించారు. అవసరమైతే ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయాలని ఆదేశించారు. సమావేశంలో మిషన్ భగీరథ డీఈలు బాలరాజు, శ్రీనివాస్‌తో పాటు ఏఈ పాల్గొన్నారు.