వీణవంక, జూలై 4 : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత పాలన చేస్తున్నదని, పేదల జీవితాలతో ఆటలాడుతున్నదని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ధ్వజమెత్తారు. కాంగ్రెస్ తూతూ మంత్రంగా ఇండ్లు మంజూరు చేసి మళ్లీ రద్దు చేస్తున్నదని మండిపడ్డారు. ప్రొసీడింగ్‌లు ఇచ్చిన ప్రతి ఒక్కరికీ ఇల్లు నిర్మించుకునేలా డబ్బులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే పేదల పక్షాన పోరాటం చేస్తానని, ఎన్ని కేసులు పెట్టుకున్నా భయపడేదిలేదని, అవసరమైతే జైలుకు వెళ్లడానికి సైతం సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు.
కరీంనగర్ జిల్లా వీణవంక మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరై రద్దయిన వారి ఇళ్లను పరిశీలించి, అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఇందిరమ్మ ఇల్లు మంజూరైందని అధికారులు ప్రొసీడింగ్ కాపీలు అందిస్తే లబ్ధిదారులు తమ ఇండ్లను కూలగొట్టుకున్నారని, వడ్డీకి అప్పులు చేసి ఇండ్ల నిర్మాణం చేపడుతున్నారని చెప్పారు. ఈ సమయంలో మీకు ఇళ్లు రావని చెప్పడం అన్యాయమన్నారు.
గతంలో ఐదు, పది సిమెంట్ బ్యాగులు తీసుకున్నారని అందుకే రద్దు అయిందని అంటున్నారని మండిపడ్డారు. వాళ్లు తీసుకున్నట్టు మీరు రుజువు చేస్తారా..? అని సీఎం రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు. అధికారులే వచ్చి ముగ్గులు పోసి, మళ్లీ రద్దు చేయడం సరైన పద్ధతి కాదని హితవు పలికారు. వీణవంక మండలంలో పైలెట్ ప్రాజెక్ట్‌గా ఎంపిక చేసిన శ్రీరాములపేటలో బేస్మెంట్ పూర్తి చేసిన లబ్ధిదారులకు ఇప్పటి వరకు లక్ష కూడా ఇవ్వలేదని, వెంటనే వారికి డబ్బులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
బడా కాంట్రాక్టర్లకు వేల కోట్లు అడ్వాన్స్‌లు ఇచ్చే ప్రభుత్వం ఇండ్లు నిర్మాణం కోసం పేదలకు ముందే ఎందుకివ్వడం లేదని ప్రశ్నించారు. ప్రొసీడింగ్‌తో పాటు వారి ఖాతాలో రూ.లక్ష జమ చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ దళితుల అభివృద్ధి కోసం దళితబంధు పథకం ఇస్తే వారికి ఇందిరమ్మ ఇండ్లు ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో 40 వేల మందిని ప్రభుత్వం ఎంపిక చేసిందని, వారందరికీ ఇండ్లు మంజూరు చేయకుంటే తీవ్ర స్థాయిలో ఉద్యమం చేస్తానని, ధర్నాకు దిగుతానని హెచ్చరించారు.
మంత్రి సీతక్క నియోజకవర్గంలో ‘ఇందిరమ్మ ఇండ్లు కాంగ్రెస్ నాయకులకేనా..?’ అని ప్రశ్నించిన పేద యువకుడిని పోలీసులు తీసుకెళ్లి చిత్రహింసలకు గురి చేస్తే ఆత్మహత్య చేసుకున్నాడని, ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని ఆరోపించారు. వెంటనే మంత్రి సీతక్కపై హత్యా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఆత్మహత్య చేసుకున్న యువకుడి కుటుంబానికి కోటి ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీపీ ముసిపట్ల రేణుక-తిరుపతిరెడ్డి, మాజీ జడ్పీటీసీ మాడ వనమాల-సాదవరెడ్డి, సింగిల్‌విండో చైర్మన్ విజయభాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.