హుజూరాబాద్ రూరల్, ఏప్రిల్ 7: ప్రజల జీవితాలతో కాంగ్రెస్ సర్కారు చెలగాటం ఆడొద్దని, ప్రజల ఆరోగ్యానికి ముప్పుగా మారే డంప్ యార్డ్‌ను రద్దు చేయాలని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అల్టిమేటం జారీ చేశారు. తన మీద కోపం ఉంటే కేసులు బానాయించి జైల్లో పెట్టాలని కానీ, ఇలా ప్రజలపై కక్ష చూపవద్దని హితవు పలికారు. ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని, లేదంటే ప్రజల మద్దతుతో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
సిర్సపల్లి శివారులో డంప్ యార్డ్ ఏర్పాటుకు వ్యతిరేకంగా హుజూరాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో పదహారు రోజులుగా జేఏసీ ఆధ్వర్యంలో దీక్ష కొనసాగుతున్న విషయం తెలిసిందే కాగా, మంగళవారం 24 గంటల నిరాహార దీక్షలో కౌశిక్ రెడ్డి పాల్గొన్నారు. ముందుగా అంబేదర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం అమరవీరులను స్మరించుకుని నిరాహార దీక్షలో కూర్చున్నారు. ప్రజాభిప్రాయాలను పట్టించుకోకుండా డంప్ యార్డ్ ఏర్పాటు చేయడం అన్యాయమని మండిపడ్డారు.
కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, కాంగ్రెస్ నియోజవర్గ ఇన్చార్జి ప్రణవ్‌బాబు ముందుండి ఉద్యమం చేయాలని, మీ వెనుక తాను ఉంటానని స్పష్టం చేశారు. తాను రాజకీయ లబ్ధికోసం దీక్ష చేయడం లేదని, హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజల శ్రేయస్సే తన ప్రథమ కర్తవ్యమని స్పష్టం చేశారు. అవసరమైతే తన ప్రాణాలైనా అర్పిస్తానని, డంప్ యార్డును నిర్మాణం మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ చేపట్టనివ్వనని తేల్చిచెప్పారు. వివిధ గ్రామాల మహిళలు, యువకులు స్వచ్ఛందంగా తరలివచ్చి పాల్గొని, దీక్షకు సంపూర్ణ మద్దతు తెలిపారు.
దీక్షలో అఖిల పక్ష నాయకులు ఈశ్వర్‌రెడ్డి, గోపాల్‌రావు, హన్మంత్‌గౌడ్, మున్సిపల్ మాజీ చైర పర్సన్ గందె రాధిక, రైతు సమాఖ్య జాతీయ అద్యక్షుడు రామారావు, రాజపల్లి సర్పంచ్ మల్లారెడ్డి, కౌన్సిలర్లు గందె శ్రీనివాస్, రవీందర్రావు, లావణ్య, సింధూజ, ప్రతాప తార, బండ నరేశ్, మంజలు, నాయకులు బండ శ్రీనివాస్, కొలిపాక శ్రీనివాస్, ప్రభాకర్‌రావు, అపరాద ముత్యంరాజు, కొయ్యడ శ్రీదేవి, ప్రభావతిరెడ్డి, మాజీ ప్రజా ప్రతినిధులు, మహిళలు తదితరులు ఉన్నారు.
డంప్ యార్డు రద్దు ఉద్యమం చూస్తుంటే తెలంగాణ ఉద్యమం గుర్తొస్తున్నది. పోరాటం చేస్తే ఏదైనా సాధించుకోవచ్చని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చెప్పారు. హుజూరాబాద్ ప్రజలు ఇదే పోరాట స్ఫూర్తితో ముందుకెళ్తే రద్దవుతుంది. డంప్ యార్డు కోసం సరారు నయాపైసా పెడుతలేదు. టెండర్లు వేసి బడా కార్పొరేట్ కంపెనీలకు అప్పజెప్పుతుంది. ఈ యార్డు ద్వారా వాసన రాదు.. అన్నీ మేమే చూసుకుంటామంటూ మాయమాటలు చెబుతారు. ప్రజలు నమ్మి మోసపోవద్దు. డంప్ యార్డును రద్దు చేయాలి. లేదంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ)ని ఆశ్రయిస్తాం.
– నిరాహారదీక్షకు సంఘీభావం తెలిపిన అనంతరం మాజీ ఎంపీ వినోద్ కుమార్