తిమ్మాపూర్, జూన్ 2: భార్య వరకట్నం కేసు పెట్టిందని (Dowry Case) మనస్థాపనతో భర్త ఆత్మహత్య చేసుకున్న విషాదకర సంఘటన తిమ్మాపూర్ మండలం రేణికుంట గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. రేణికుంట గ్రామానికి చెందిన నల్లాల జీవన్ రెడ్డికి (37) కొన్నెండ్ల కింద చిన్న కోడూరు మండలం ఎల్లయ్యపల్లె (చలకాలపల్లి) గ్రామానికి చెందిన దీపతో వివాహమైంది. వీరికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. వ్యవసాయం చేసుకుంటూ కుటుంబంతో కలిసి రేణిగుంటలో ఉంటున్న వీరి మధ్య ఇటీవల కలహాలు చోటు చేసుకున్నాయి.
ఈ క్రమంలో దీప ఆమె తల్లి గారి ఊర్లో భర్త, అత్తమామ, మరిది కుటుంబసభ్యులపై వరకట్నం కేసు నమోదు చేయించింది. దీంతో వాళ్లంతా వెళ్లి కుటుంబ సభ్యులు స్టేషన్ బెయిల్ తీసుకున్నారు. ఈ వ్యవహారంతో పాటూ భార్య కాపురానికి రావడం లేదని మనస్థాపం చెందిన జీవన్ రెడ్డి సోమవారం ఉదయం ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల సమాచారం మేరకు ఎల్ఎండీ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఆత్మహత్యకు గల కారణాలను తెలుసుకొని దర్యాప్తు చేస్తున్నారు.