రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ నుంచి కొంత మంది ఉన్నతాధికారులకు భారీ ముడుపులు అందుతున్నాయా..? అందుకే కొంతమంది ఎన్ని తప్పులు చేసినా ఉపేక్షిస్తున్నారా..? సీఎంఆర్ ధాన్యాన్ని తెగ నమ్ముకున్నా చర్యలు తీసుకోవడానికి వెనుకంజ వేస్తున్నారా..? మాముళ్లకు అలవాటు పడిన అధికారులు అక్రమార్కులను వదిలేస్తూ ప్రభుత్వ లక్ష్యాలకు తూట్లు పొడుస్తున్నారా..? రా రైస్ పేరిట రేషన్ బియ్యాన్ని సివిల్ సైప్లెకి పెట్టినా అండగా నిలుస్తున్నారా..? ఈ వ్యవహారం వల్ల నీతి, నిజాయితీగా మిల్లులు నడుపుతున్న యజమానులు ఇబ్బందులకు లోనవుతున్నారా..? అసోసియేషన్‌తో పాటు అధికారులకు ముడుపులు చెల్లించలేక మానసిక వ్యథను అనుభవిస్తున్నారా..? అంటే అవుననే సమాధానమే వస్తున్నది.
అక్రమార్కులకు అధికారులు వంత పాడడానికి ప్రధాన కారణం భారీగా ముడుపులు ముట్టడమే కారణమన్నది ఇటీవల మిల్లర్లలో జరుగుతున్న గొడవల వల్ల బయటకు వస్తున్నది. అయితే అసోసియేషన్ చూపుతున్నట్టు సదరు అధికారులకు అంత పెద్ద మొత్తంలో లంచాలు ఇచ్చారా..? లేదా..? అన్నదానిపై వచ్చే సమావేశాల్లో నిలదీసేందుకు పలువురు మిల్లర్లు సిద్ధమవుతుండగా.. తాజాగా బయటకు వచ్చిన ముడుపుల వ్యవహారం, అలాగే ఈసీ సమావేశం జరిగిన తీరు ప్రస్తుతం మిల్లర్లలో హాట్‌టాపిక్‌గా మారింది.
కరీంనగర్, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ నుంచి పౌరసరఫరాల శాఖతో సంబంధమున్న అధికారులకు భారీగా ముడుపులు ముడుతున్నట్టు తాజాగా రైస్‌మిల్లర్ల గొడవ ద్వారా వెలుగులోకి వస్తున్నది. ఈ నెల 26న ఎగ్జిక్యూటివ్ కమిటీ (ఈసీ) మీటింగ్‌లో జరిగిన చర్చ, ఈసీ సభ్యులు అడిగిన ప్రశ్నలు, పెద్ద మొత్తంలో డబ్బుల అవకతవకలు వంటి అంశాలపై శనివారం ‘నమస్తే తెలంగాణ’లో ‘రైస్‌మిల్లర్స్ అసోసియేషన్‌లో 2 కోట్ల గోల్మాల్?’ శీర్షికన ప్రచురించిన కథనం సంచలనం సృష్టించింది.
ప్రస్తుతం మిల్లర్లలో ఇదో పెద్ద చర్చనీయాంశం కాగా.. అనేక కోణాలు బయటకు వస్తున్నాయి. నిశితంగా పరిశీలిస్తే ఈసీ సభ్యులు ప్రశ్నించిన సమయంలో అధికారులకు ముడుపులు ఇచ్చిన విషయాన్ని నాయకత్వం వెల్లడించింది. ఈ లెక్కలను చూసి ఈసీ సభ్యుల కళ్లు బైర్లు కమ్మాయని సమాచారం. ప్రధానంగా జిల్లాలో పనిచేసిన ఓ ఉన్నతాధికారికి ఏకంగా 15 లక్షలు ఇచ్చినట్టు రికార్డుల్లో చూపెట్టింది. అందులో ఓసారి ఐదు లక్షలు, మరోసారి పది లక్షలు ఇచ్చినట్టు బయట పెట్టింది.
సదరు అధికారి చేసిన మిల్లర్లకు చేసిన సహాయం ఏమిటీ? ఎందుకంత పెద్దమొత్తంలో ముడుపులు ఇవ్వాల్సి వచ్చిందో చెప్పాలని సభ్యులు ప్రశ్నించినట్టు అత్యంత విశ్వసనీయ సమాచారం. అంతేకాదు, అంత పెద్ద మొత్తంలో ముడుపులు తీసుకోవడానికి కారణం ఏమిటో..? అవసరమైతే సదరు అధికారి వద్దకే వెళ్లి అడిగేందుకు కూడా కొంత మంది మిల్లర్లు సిద్ధమైనట్టు తెలుస్తున్నది.
అలాగే డీఎం, డీఎస్వో స్థాయి అధికారులకు పది లక్షల చొప్పున ఇచ్చినట్టు లెక్కలు చూపారని సమాచారం. అయితే వీరికి ఇంత పెద్దమొత్తంలో అసోసియేషన్ నుంచి ఎందుకు ఇచ్చారో చెప్పాలని ప్రశ్నించినట్టు తెలుస్తున్నది. నూటికి 95 శాతం మంది యజమానులు నీతిగా, నిజాయితీగా నిబంధనలకు లోబడి మిల్లులు నడుపుతున్నామని, ఎవరో అక్రమాలు చేసే కొంతమందిని కాపాడేందుకు అధికారులకు భారీ మొత్తంలో ముడుపులు ఇచ్చారన్న చర్చ ప్రస్తుతం మిల్లర్లలో నడుస్తున్నది. అక్రమార్కులకు అండగా నిలిచేందుకు అసోసియేషన్ కాదన్న భావన వారిలో వ్యక్తమవుతున్నది.
ఒక వేళ ఇవ్వాల్సి వస్తే ఈసీ సమావేశం పెట్టి, చర్చించాలనే నిబంధనలున్నా.. వాటిని పట్టించుకోకుండా ఎలా ఇస్తారని ప్రశ్నించినట్టు తెలుస్తున్నది. అయితే మరోకోణంలో కూడా మిల్లర్లలో చర్చ జరుగుతున్నది. నిజానికి లెక్కల్లో చూపిన విధంగా సదరు అధికారులకు ముడుపులు ముట్టజెప్పారా..? లేదా..? లేక అందులోనూ ఏమైనా గోల్మాల్ చేశారా..? మధ్యవర్తిత్వం వహించిన వ్యక్తి అందులో చేతివాటం చూపారా..? అనే అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. నిజానికి ఇవే కాదు, ఇంకా కొంతమంది అధికారులకు ఇచ్చిన ముడుపుల వ్యవహారం ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నది.
అక్రమార్కులకు అండగా..?
భారీ మొత్తంలో అధికారులకు మామూళ్లు ముడుతుండడం వల్లే అధికారులు కొంత మంది అక్రమార్కులకు అండగా నిలుస్తున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఒక జిల్లాలో జిల్లాలో రా రైస్ పేరిట కొంత మంది సివిల్‌సైప్లె గోదాంకు రేషన్ బియ్యాన్ని పంపించారనే విమర్శలు వస్తున్నాయి. దాదాపు 250 నుంచి 350 ఏసీకేల బియ్యాన్ని ఇలా పంపించారని, అందులో పెద్ద మొత్తంలో చేతులు మారాయన్న ఆరోపణలున్నాయి. ఇవేకాదు, మామూళ్లకు ఆశపడుతున్న అధికారులు, రేషన్ బియ్యం సరఫరాలో కొంత మందిపై కేసులు నమోదైనా చర్యలు తీసుకోకుండా వత్తాసు పలుకుతూ.. ప్రభుత్వ పరంగా వచ్చే ధాన్యం కేటాయింపులు, బిల్లులు చెల్లింపు వంటి వాటి విషయంలో సదరు అక్రమార్కులకే మొదటి ప్రాధాన్యం ఇస్తున్నారని మిల్లర్లలో చర్చ జరుగుతున్నది.
అధికారులు నిబంధనలను తుంగలో తొక్కుతూ అక్రమార్కులకు అండగా నిలుస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లంచాలు తీసుకునే అధికారుల ఆశను ఆసరాగా చేసుకొని.. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో కొంత మంది మిల్లర్లు కోట్ల రుపాయాల విలువైన సీఎంఆర్ ధాన్యం విక్రయించి జల్సాలు చేస్తున్నారన్న చర్చ జరుగుతున్నది. అందులోనూ అర కోటికిపైగా విలువైన ధాన్యం అమ్ముకున్న అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోకపోవడం.. బ్లాక్ లిస్టులో పెట్టకపోవడం వెనుక భారీగా డబ్బులు చేతులు మారడమే అన్న చర్చ ప్రస్తుతం మిల్లర్లలో జరుగుతున్నది.
వసూళ్ల పర్వం
అసోసియేషన్ నుంచి బయటకు వస్తున్న సమాచారం ప్రకారం.. లక్షల్లో ముడుపులు తీసుకుంటున్న అధికారులు.. అవి చాలవన్నట్టు మిల్లర్ల అవసరాలను ఆసరాగా చేసుకొని భారీగా వసూళ్లకు పాల్పడినట్టు తెలుస్తున్నది. ప్రధానంగా ఎఫ్‌సీఐ గోదాముల్లో బియ్యం దించడానికి కేటాయించే ఒక్కో బెడ్‌కు 18వేల చొప్పున వసూలు చేసిన తీరు ప్రస్తుతం వెలుగులోకి వస్తున్నది. ఈ వ్యవహారంలో ముగ్గురు అధికారులు కీలక పాత్ర వహించగా.. దీనికి అసోసియేషన్‌లోని కొంత మంది మద్దతుగా నిలిచారన్న చర్చ మిల్లర్లలో నడుస్తున్నది.
ఆరు ఏసీకేలకు ఒక బెడ్ కేటాయిస్తుండగా, ఈ పేరిట సుమారు 60లక్షల నుంచి 70 లక్షల వరకు వసూలు చేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి. బెడ్ కేటాయింపులు కావాలంటే మిల్లర్ ముందుగా ముడుపులు ఇవ్వాల్సిందే. అవి వచ్చినట్టు ధ్రువీకరించుకున్న తర్వాతే బెడ్ కేటాయింపులు, బియ్యం డౌన్లోడ్ జరిగాయని ఓ మిల్లర్ వాపోయాడు. నిబంధనల ప్రకారం బియ్యం పెట్టినా ముడుపులు ఎందుకివ్వాలని ఒకరిద్దరు ప్రశ్నిస్తే.. ఇవ్వకపోతే మిల్లు బంద్ చేసుకోవాలని ఓ అధికారి నేరుగా చెప్పాడని తన ఆవేదనను వ్యక్తం చేశాడు.
బెడ్ పేరిట వసూలు చేసిన డబ్బుల్లో సదరు ముగ్గురు అధికారులకు ఎంత ముట్టజెప్పారు? అసోసియేషన్‌కు ఎంత మిగిలాయో చెప్పాలని ఇటీవల జరిగిన ఈసీ సమావేశంలో ప్రశ్నించినట్టు తెలుస్తున్నది. ఈ లెక్కల వ్యవహారాన్ని సైతం పూర్తిగా తేల్చి చెప్పాలన్న డిమాండ్ ప్రస్తుతం మిల్లర్ల నుంచి వస్తున్నది. వీటితోపాటు ధాన్యం క్వింటాల్‌కు 50 పైసల చొప్పున సుమారు 50 లక్షలకు వరకు జరిగిన వసూళ్ల లెక్కలు తేల్చాలని పట్టుబడుతున్నట్లుగా సమాచారం. ఇదిలా ఉంటే తాజాగా ట్రాన్స్పోర్ట్ అగ్రిమెంట్ల పేరిట 4500 వసూలు చేస్తున్నారని మిల్లర్ల ద్వారా సమాచారం వస్తున్నది. నిజానికి ఈ అగ్రిమెంట్‌కు కేవలం 500 మాత్రమే అవుతుందని, దీనిపై సైతం ప్రశ్నించేందుకు పలువురు సిద్ధమవుతున్నట్టు తెలుస్తున్నది.