పట్టణాల ప్రగతి మరింత పరుగులు పెట్టబోతున్నది. అభివృద్ధిలో ఆదర్శంగా నిలువబోతున్నది. గతంలో ఎన్నడూ లేనివిధంగా రాష్ట్ర బడ్జెట్లో ప్రభుత్వం జిల్లాలోని కరీంనగర్ కార్పొరేషన్, హుజూరాబాద్, జమ్మికుంట, కొత్తపల్లి, చొప్పదండి మున్సిపాలిటీలకు నిధుల వరద పారించింది. సమీకృత మార్కెట్లు, వైకుంఠధామాల నిర్మాణం, ఇతర పద్దుల కింద భారీ కేటాయింపులు చేయగా, ఇక కరీంనగర్ నగరపాలక సంస్థకు ప్రత్యేకంగా స్మార్ట్‌సిటీలో 200 కోట్ల మేర, అమృత్ కింద 25 కోట్ల మేర వచ్చే అవకాశం ఉన్నట్లు యంత్రాంగం అంచనా వేస్తున్నది. కాగా, పెరిగిన కేటాయింపులతో అభివృద్ధి పనులు నిరంతరం కొనసాగనుండగా, సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.
కార్పొరేషన్, ఫిబ్రవరి 8: జిల్లా మున్సిపాలిటీలు, నగరానికి నిధులు వరద పారింది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో పురపాలక శాఖ ఈ సారి భారీ కేటాయింపులు చేసింది. ఇప్పటికే రాష్ట్రంలోని మున్సిపాలిటీలకు నేరుగా నిధులు ఇవ్వడంతో పాటు పట్టణ ప్రగతి కింద నిధులను మంజూరు చేస్తున్న ప్రభుత్వం, మౌలిక సదుపాయాల కల్పనకూ ప్రత్యేక నిధులు ఇస్తున్నది. తాజాగా ఆయా పట్టణాల్లో వైకుంఠధామాలు, సమీకృత మార్కెట్ల నిర్మాణాలకు ప్రత్యేకంగా కేటాయింపులు చేసింది.
స్మార్ట్ సిటీ కింద 200కోట్లు
బడ్జెట్లో భాగంగా కరీంనగర్ జిల్లాలోని కరీంనగర్ నగరపాలక సంస్థతో పాటు హుజూరాబాద్, జమ్మికుంట, కొత్తపల్లి, చొప్పదండి మున్సిపాలిటీలకు ఈ ఏడాది భారీగానే నిధులు రానున్నాయి. కరీంనగర్ నగరపాలక సంస్థకు ప్రత్యేకంగా స్మార్ట్‌సిటీలో 200 కోట్ల మేరకు నిధులు రానున్నాయి. అలాగే అమృత్ కింద రాష్ట్ర బడ్జెట్లో 150 కోట్ల మేర కేటాయించగా ఇందులో కరీంనగర్‌కు 25 కోట్ల మేర వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. కరీంనగర్ మున్సిపల్ ఆధ్వర్యంలో స్మార్ట్‌సిటీ కింద ఇప్పటికే సుమారుగా 900 కోట్లతో పనులు సాగుతున్నాయి. వీటిల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 50 శాతం చొప్పున నిధులు ఇస్తున్నాయి.
ఈ క్రమంలో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 196 కోట్ల నిధులు ఇవ్వగా ఈ సారి బడ్జెట్లో మరో 200 కోట్లు కేటాయించింది. అలాగే ఇతర స్మార్ట్‌సిటీ నగరాల కంటే కరీంనగర్లో వేగంగా అభివృద్ధి పనులు సాగుతుండడంతో మరిన్ని నిధులు సైతం వచ్చే అవకాశం ఉందని అధికారవర్గాలు చెప్పుతున్నాయి. ఇక అమృత్ పట్టణాల్లో భాగంగా కరీంనగర్‌కు ఈ సారి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రూ.25 కోట్ల చొప్పున నిధులు వచ్చే అవకాశం ఉంది.
మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట
బడ్జెట్లో సమీకృత మార్కెట్ల నిర్మాణానికి ప్రభుత్వం 400 కోట్లు కేటాయించింది. కాగా, కరీంనగర్లో ఇప్పటికే నాలుగు సమీకృత మార్కెట్ల నిర్మాణం శరవేగంగా సాగుతుంది. వీటిల్లో కలెక్టర్ క్యాంపు కార్యాలయం ముందు చేపడుతున్న సమీకృత మార్కెట్‌కు రాష్ట్ర ప్రభుత్వం నేరుగా 16 కోట్లను ఇప్పటికే మంజూరు చేసింది. ప్రస్తుతం బడ్జెట్ కేటాయింపుతో మిగిలిన మూడు మార్కెట్లకు కూడా నిధుల కొరత ఉండే అవకాశం లేదు. అలాగే ప్రతి నెలా నగర పాలక సంస్థకు 2.50 కోట్ల చొప్పున పట్టణ ప్రగతి కింద నిధులు మంజూరవుతున్నాయి.
ఈ సారి ఈ నిధులు పెరిగే అవకాశం ఉంది. హుజూరాబాద్, జమ్మికుంట, కొత్తపల్లి, చొప్పదండి మున్సిపాలిటీలకు ఈ సారి సమీకృత మార్కెట్లు, వైకుంఠధామాల నిర్మాణాలకు సుమారుగా 3 కోట్ల నుంచి 3.50 కోట్ల మేర నిధులు వచ్చే అవకాశమున్నది. ఇతర పద్దుల కింద భారీగానే నిధులు మంజూరవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రతి మున్సిపాలిటీ పరిధిలో తప్పనిసరిగా ఒక్కటైనా సమీకృత మార్కెట్ నిర్మించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు వేస్తున్నది. ఈ సారి కేటాయింపులతో ఈ పనులు వేగవంతమయ్యే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు పట్టణ ప్రగతి కింద కూడా నిధులు మంజూరవుతుండడంతో రోడ్లు, మురుగు కాల్వలతో పాటు, ఇతర మౌళిక సదుపాయాల పనులు వేగవంతం కానున్నాయి.
పట్టణాల అభివృద్ధికి భారీ కేటాయింపులు
రాష్ట్రంలోని నగరాలు, పట్టణాల అభివృద్ధి కోసం ప్రభుత్వం బడ్జెట్లో భారీ నిధులు కేటాయించడం హర్షణీయం. పట్టణాల రూపురేఖలు మార్చే విధంగా భారీ కేటాయింపులు చేశారు. ముఖ్యంగా రోడ్లు, మురుగు కాలువల అభివృద్ధితోపాటు ఇతర మౌళిక సదుపాయాల కల్పన విషయంలో ప్రత్యేకంగా నిధులు కేటాయించడం ఆనందంగా ఉంది. ఇక పనులన్నీ వేగంగా పూర్తయ్యే అవకాశం కనిపిస్తున్నది. అలాగే నేరుగా మున్సిపాలిటీలకే నిధులు మంజూరు చేయడం గొప్ప విషయం. నగరంలో స్మార్ట్‌సిటీ కింద రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా నిధులు మంజూరు చేయడంతో కేంద్రం కూడా నిధులు మంజూరు చేయాల్సి ఉంది. వీటితో పాటుగా ఇతర పద్దుల కింద భారీగానే కేటాయించడం హర్షణీయం.
– వై సునీల్‌రావు, మేయర్ (కరీంనగర్)