Dharmaram | ధర్మారం, జూలై 31 : పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని చామనపల్లి గ్రామంలో గత రెండు రోజులగా కురిసిన వర్షాలకు గ్రామంలోని పలువురి ఇండ్లు కూలిపోయాయి. దీంతో స్థానిక ఎంపీడీవో వీ సుమలత పరిశీలించారు. గ్రామంలో ఎనిమిది ఇండ్లు కూలిపోగా వాటిలో శిథిలమైన రెండు ఇండ్లు పూర్తిగా కూలిపోయాయి. మరో ఇండ్ల గోడలు పాక్షికంగా కూలిపోయాయి. దీంతో స్పందించిన సర్పంచ్ వేల్పుల రేవతి నాగరాజు స్పందించి ఇండ్లు కూలిన నిర్వాసితులను గురువారం స్థానిక ప్రభుత్వ పాఠశాలలో తాత్కాలికంగా పునరావాసం కల్పించి వసతులు ఏర్పాటు చేశారు. గ్రామంలో ఇల్లు కూలిన సమాచారాన్ని సర్పంచ్ రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ దృష్టికి తీసుకెళ్లారు.
స్పందించిన మంత్రి సంబంధిత అధికారులు గ్రామాన్ని సందర్శించి కూలిన వారి సమాచారాన్ని సేకరించాలని ఆదేశించారు. దీంతో స్థానిక ఎంపీడీవో వీ సుమలత శుక్రవారం గ్రామాన్ని సందర్శించారు. స్థానిక సర్పంచ్ రేవతి నాగరాజు, పంచాయతీ కార్యదర్శి ప్రశాంత్ తో కలిసి ఎంపీడీవో సుమలత కూలిన ఇండ్లను పరిశీలించారు. ఇండ్లు కూలిన సమాచారాన్ని సేకరించి వారి వివరాలు నమోదు చేయాలని స్థానిక పంచాయతీ కార్యదర్శిని ఆమె ఆదేశించారు. నిర్వాసితులను ఆదుకోవడానికి తగిన పరిహారం అందించేందుకు ప్రభుత్వానికి నివేదిస్తామని ఎంపీడీవో సుమలత తెలిపారు. అనంతరం రెవెన్యూ ఇన్స్పెక్టర్ -2 శివ కోటేష్ గ్రామాన్ని సందర్శించి కూలిన ఇండ్ల వివరాలను జీపీఓ ఎల్లయ్య బాధితుల వివరాలను నమోదు చేశారు.