Peddapally | కోల్ సిటీ, మే 29: తండ్రి బాటలో తనయుడిగా అతి చిన్న వయసులోనే 14 సార్లు రక్తదానం చేసి నేటి యువతకు దేవి రోహిత్ ఆదర్శంగా నిలుస్తున్నాడు. తండ్రి బాటలో తనయుడిగా యుక్త వయసులో సమాజ హిత కార్యక్రమాలు చేపడుతూ తాను రక్తదానం చేస్తూ తోటి స్నేహితులతో కూడా ఆపదలో ఉన్నవారికి రక్తదానం చేసేలా ప్రోత్సహిస్తున్నందుకు ప్రతిఫలంగా రోహిత్ సేవలకు గౌరవ దక్కింది.
వసుంధర విజ్ఞాన వికాస మండలి 32వ వార్షికోత్సవాల సందర్భంగా జూన్ 10న హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగే కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని దేవి రోహిత్ అందుకోనున్నారు. అతి చిన్న వయసులోనే 14 సార్లు రక్త దానం చేసి రక్తదానంతో అత్యవసర పరిస్థితుల్లో ప్రాణదాతగా నిలుస్తున్నాడు.
తనతో పాటు తన స్నేహితులను ప్రోత్సహిస్తూ తన కుటుంబ సభ్యులను కూడా రక్తదానం చేపిస్తూ ప్రజలలో అవగాహన కల్పిస్తూ ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ గోదావరిఖని క్లబ్ ట్రైనర్ గా, వివిధ రకాల సమాజ సేవ, ఆధ్యాత్మికత కార్యక్రమాల్లో యోగ వాలంటీర్ గా పాల్గొంటూ యువతకు ఆదర్శంగా నిలుస్తున్న దేవిరోహిత్ ను వసుంధర విజ్ఞాన వికాస మండలి జ్యూరీ కమిటీ అభినందనలు తెలుపుతూ స్ఫూర్తి పురస్కారానికి ఎంపిక చేసింది.
ఈ సందర్భంగా రోహిత్ ను పలు స్వచ్ఛంద సంఘాల ప్రతినిధులు అభినందించారు. తన తండ్రి దేవి లక్ష్మీనరసయ్య వారసుడిగా ఆయన సేవా భావజాలంను పునికి పుచ్చుకొని అదే బాటలో నడుస్తుండడం అభినందనీయమని కొనియాడారు.