MLA Dr. Kalvakuntla Sanjay | కోరుట్ల, జనవరి 5: భవిష్యత్ తరాల అభ్యున్నతిని దృష్టిలో ఉంచుకొని నిజాయితీపరులకు ఓటు వేసి ఎన్నుకోవాలని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల పేర్కొన్నారు. సోమవారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పట్టణ పరిసర గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు ప్రభుత్వం మంజూరు చేసిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీకి దక్కుతుందన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తొలి నాళ్లలోనే గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి పెద్ద పీట వేసినట్లు తెలిపారు.
70 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో గ్రామాల్లో కేవలం 6 గంటల కరెంటు మాత్రమే ఉండేదని, గుక్కెడు మంచి నీళ్లు దొరక్క ప్రజలు ఇబ్బందులు పడ్డారని గుర్తు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పల్లె పల్లెకు 24 గంటల కరెంటు, ఇంటింటికి మంచినీరు, వైకుంఠ దామాలు, పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు, చెరువులో పూడికతీత పనులు, పంట పొలాలకు పుష్కలంగా సాగునీరు అందించారని తెలిపారు. కేసీఆర్ పాలనలో పల్లెలు పాడిపంటలతో కళకళలాడాయని పేర్కొన్నారు. అర్హులందరికీ పింఛన్లు అందించి ఆర్థికంగా అండగా నిల్చారని తెలిపారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి జాడ లేదని విమర్శించారు.
విద్య, వైద్య రంగాన్ని పూర్తిగా విస్మరించారని పేర్కొన్నారు. కోరుట్లలో నిర్మించిన వంద పడకల ఆసుపత్రిలో వైద్యులు లేక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యుల కొత్త తీర్చాలని పలుమార్లు ప్రభుత్వాన్ని విన్నవించుకున్న పట్టించుకున్న పాపాన పోలేదని పేర్కొన్నారు. గ్రామాల్లో కులాలు, మతాల మధ్య విద్వేషాలు సృష్టించి ఓట్లు దండుకొనే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికలప్పుడే కాంగ్రెస్ నాయకులకు పథకాలు గుర్తుకొస్తాయని ఎద్దేవా చేశారు.
తాను స్వలాభం కోసం అమ్ముడుపోయే వ్యక్తిని కాదని, జేజమ్మలు దిగొచ్చిన తన పంథా మార్చుకోనని చెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లో అభివృద్ధిని చూసి ఓటు వేయాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాజేష్, మైనార్టీ పట్టణ అధ్యక్షుడు ఫహీం, నాయకులు చీటి వెంకటరావు, సజ్జు, అస్లాం, జాల వినోద్ కుమార్, పొట్ట సురేందర్, చిత్తరి ఆనంద్, శ్రీపతి, మురళి, ఉమాదేవి, అలేఖ్య, తదితరులు పాల్గొన్నారు.