Heavy rain | జూలపల్లి, ఆగస్టు 28 : పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలంలో బుధవారం నుంచి గురువారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి జనజీవనం స్తంభించిపోయింది. ఎడతెరిపి లేని వర్షాలకు ప్రజలు ఇబ్బందులు పడ్డారు. దంచి కొట్టిన వానలకు వాగులు, వంకలు, ఒర్రెలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోని నివాస గృహాల్లోకి వరద నీరు చేరడంతో పలువురు చాలా ఇబ్బందులు పడ్డారు.
వరి, పత్తి, కూరగాయల తోటలు, వ్యవసాయ బావులు నీట మునిగాయి. జూలపల్లి మండలం వడ్కాపూర్ ఎలిగేడు మండలం ధూళికట్ట గ్రామాల మధ్య హుస్సేన్య వాగుపై మంతెన నీట మునిగింది. దీంతో రెండు మండలాల మధ్య రాకపోకలు నిలిచి పోయాయి. అత్యవసర పరిస్థితుల్లో నీట మునిగిన వంతెన పై నుంచి ప్రయాణం చేస్తూ ప్రమాదాలు కొనితెచ్చుకున్న సందర్భాలున్నాయి. గతంలో జూలపల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో పనిచేసిన మహమ్మద్ హుస్సేన్ తన సైకిల్ పట్టుకొని వంతెన దాటుతుండగా ప్రమాదవశాత్తు ప్రవాహంలో కొట్టుకుపోయి మృతి చెందాడు.
ప్రతీ ఏటా వాన కాలంలో వంతెన మునిగి పోతుందనీ, ప్రభుత్వం వెంటనే కొత్త వంతెన నిర్మించాలని ప్రజలు విజ్ఞప్తి చేశారు. వడ్కాపూర్ – జాలపల్లి, కోనరావుపేట- ధూళికట్ట, తేలుకుంట- చీమలపేట గ్రామాల మధ్య పాతకాలం నాటి లో లెవల్ కల్వర్టులు చిన్నపాటి వర్షాలకు మునిగి పోతున్నాయి. ప్రజా ప్రతినిధులు అధికారులు స్పందించి శాశ్వత నిర్మాణాలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. మండల వ్యాప్తంగా దాదాపు 6 సెంటీమీటర్ల దాకా వర్షపాతం నమోదైనట్లు ఏఎస్వో ప్రకాష్ రెడ్డి వెల్లడించారు.