Prajavaani | కరీంనగర్ కలెక్టరేట్, సెప్టెంబర్ 22 : ఫొటోలో కనిపిస్తున్న వృద్ధ దంపతుల పేర్లు ఎంకర్ల వెంకటమ్మ, నర్సయ్య నగర శివారు ఎల్ఎండిలోని ఫిష్ కాలనీ నివాసితులు వీరికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు సంతానం కాగా, అందరికి వివాహాలు అయి ఎవరికి వారు స్థిరపడ్డారు. ఈ దంపతుల సంపాదనలో సగం తమ వద్ద ఉంచుకుని, మిగతా సగం పెద్దకుమారుడు, ఇద్దరు కుమార్తెలకిచ్చారు. తల్లిదండ్రుల వద్ద ఉన్న సగం ఆస్థిని చిన్న కుమారుడు హరిప్రసాద్‌కు అప్పగించి, తమను పోషించాలని కోరగా అంగీకరించినట్లు పేర్కొంటున్నారు.
కొద్దిరోజులు సక్రమంగానే చూసుకున్న హరిప్రసాద్ తల్లిదండ్రుల పేర ఉన్న ఆస్తిని తన పేర రాయించుకొని, అనంతరం వారిని ఇంటి నుంచి గెంటేయగా, రెండేళ్లుగా గ్రామంలోని ఇతరుల ఇండ్లలో నివాసముంటూ వారువీరిచ్చే తిండిగింజలతో బతుకు వెళ్ళదీస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్న కుమారుడి మానసిక వేధింపులతో తండ్రి నర్సయ్యకు పక్షవాతం రాగా, వైద్యం కోసం రూ.4లక్షల వరకు ఖర్చయ్యాయని, ఇవైనా భరించాలని ఇంటికెళ్ళి వేడుకుంటే ససేమిరా అంటూ వారి ముఖంపైనే తలుపులు వేసుకున్నాడని రోధిస్తున్నారు. హరిప్రసాద్ నిర్వాకంతో వీధిన పడ్డ వైనంపై అధికారులకు ఇప్పటికే ఫిర్యాదు చేయగా, పిలిపించి కౌన్సిలింగ్ చేశారు.
అయినా, పట్టించుకోకపోవటంతో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి వచ్చి తమ దైన్య స్థితిపై అధికారుల ఎదుట ఆదంపతులు కన్నీటి పర్యంతమయ్యారు. పెద్దకుమారుడు, కూతుళ్ళు తమ వద్దకు రమ్మని కోరినా వారింటికి వెళ్లేందుకు మనసు సమ్మతించక, తాము పడుతున్న బాధలు వారికి చెప్పుకోలేక అధికారుల వద్దకొచ్చి ఆదుకోండని వేడుకున్నారు. అయితే, వీరి బాధను అధికారులు సైతం పట్టించుకోనట్లుగా వ్యవహరించటంతో తమకు దిక్కెవరంటూ కంటనీరు పెడుతూ వెనుదిరిగారు. ఏడాదికాలం నుంచి ప్రజావాణిలో అనేకసార్లు ఫిర్యాదు చేసినా ఎలాంటి స్పందన లేదని వాపోయారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి తమకు న్యాయం చేయాలని రోదిస్తూ వెనుదిరిగారు.
కరీంనగర్ రూరల్ మండలంలోని బొమ్మకల్ గ్రామానికి చెందిన కనవేని లక్ష్మి అనే వృద్ధురాలు పెన్షన్ కోసం రెండేళ్ళుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా, పెన్షన్ మంజూరీ చేయటంలేదని ప్రజావాణిలో ఫిర్యాదు చేసింది. తనకు 70 ఏళ్లు దాటగా, వృద్ధాప్యంలో భర్త చనిపోయి ఒంటరిగా జీవిసున్నా.. ఎలాంటి ఆదాయం లేక జీవనం భారంగా మారిందని అధికారుల ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామకార్యదర్శి నుంచి కలెక్టర్ దాకా ఇప్పటివరకు పదిసార్లు దరఖాస్తులు ఇచ్చినా, ఫించన్ మాత్రం వస్తలేదంటూ అధికారుల ఎదుట రోధించారు. స్పందించిన అధికారులు వెంటనే విచారణ జరిపి, పింఛన్ మంజూరీ చేయాలని ఆదేశించారు.
ప్రజావాణిలో 318 దరఖాస్తులు
కలెక్టరేట్ ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 318 మంది సమస్యల పరిష్కారం కోసం అధికారులకు ధరఖాస్తులు అందజేశారు. అదనపు కలెక్టర్ లక్ష్మికిరణ్, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్, డీఆర్వో వెంకటేశ్వర్లు, ఆర్డీవో కే మహేశ్వర్, కలెక్టరేట్ కార్యనిర్వహణాధికారి గడ్డం సుధాకర్ వాటిని స్వీకరించి పరిశీలించిన అనంతరం పరిష్కరించాలంటూ సంబంధితాధికారులకు బదిలీ చేశారు.