Sultanabad | సుల్తానాబాద్ రూరల్, మే 22: మాదక ద్రవ్యాల వినియోగం వల్ల ఎన్నో అనార్థాలు జరుగుతాయని ఎక్సైజ్ సీఐ గురునాథ్ అన్నారు. పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని గర్రెపల్లి మోడల్ స్కూల్లో గురువారం ఆంగ్లం ఉపాధ్యాయుల రెండో విడత శిక్షణ కార్యక్రమంలో భాగంగా మూడో రోజు శిక్షణా కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులకు మాదక ద్రవ్యాల అనర్థాలపై అవగాహన కల్పించారు. విద్యార్థులు ఈ దశలో కొన్ని సందర్భాల్లో పాన్, గుట్కా, మత్తు పదార్థాల అలవాటుకు లోనై వారి కుటుంబాలను తలదించుకునేలా చేస్తున్నారని ఉపాధ్యాయులకు సూచించారు. ఈ నాటి విద్యార్థులే రేపటి సమాజ నిర్మాతలు కావున ఉపాధ్యాయులుగా మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలు వారి కుటుంబ సభ్యులకు సమావేశాల్లో తెలియజేయాలని కోరారు.
డ్రగ్ రహిత సమాజాన్ని తయారు చేస్తానని ఉపాధ్యాలచే ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో శ్రీరామ చంద్ర మిషన్, స్పీకర్ మారుతి రాజు ఉపాధ్యాయులతో మాట్లాడుతూ హార్ట్ బేస్డ్ ఎడ్యుకేషన్, విద్యార్థుల్లో మానసిక వికాసం చెందే యోగా, ధ్యానం లాంటి వాటికి ప్రాముఖ్యత గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో కోర్సు డైరెక్టర్ ఆరేపల్లి రాజయ్య, ప్రోగ్రాం అబ్జర్వర్ సి.హెచ్. ప్రద్యుమ్న కుమార్, ఆర్ పీలు జి .జగదీశ్వర్, కె.శ్రీనివాస్, జె.శ్రీనివాస్, డి.నాగరాజు , సీఆర్.పి. సదానందం, సి.సి.ఓ. రజియా, అంతర్గాం, జూలపల్లి, సుల్తానాబాద్, రామగిరి, మంథని, ఎలిగేడు, కమాన్పూర్, ధర్మారం మండలాల ఆంగ్లం, సెకండరీ గ్రేడ్ టీచర్స్ దాదాపు 160 ఉపాద్యాయులు పాల్గొన్నారు.