మల్యాల, జూన్ 1 : ‘రామ లక్ష్మణ జాన కీ.. జై బోలో హన్మాన్కీ’ ‘శ్రీ రామ జయ రామ, జయ జయ రామ’ అంటూ రామ నామ సంకీర్తనలతో కొండగట్టు మార్మోగింది. శనివారం హనుమాన్ పెద్ద జయంతి సందర్భంగా కొండంతా కిక్కిరిసిపోయింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి లక్షా 50వేల మందికిపైగా తరలివచ్చిన దీక్షా పరులతో కాషాయవర్ణ శోభితమైంది. ఎక్కడా ఇబ్బంది లేకుండా మాల విరమణ సాఫీగా సాగింది. జయంతి సందర్భంగా ఉదయం నుంచే స్వామివారికి అర్చకులు ప్రత్యేక పూజలు చేయడం, భద్రాద్రి ఆలయం తరపున తొలిసారి పంపిన పట్టువస్ర్తాలతో అంజన్న మెరిసిపోవడంతో భక్తజనం తరించి పులకించింది.
ఆలయానికి భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్ననేపథ్యంలో ఆర్జిత సేవలను ఆదివారం వరకు రద్దు చేసిన ఆలయ అధికారులు, తిరిగి సోమవారం ప్రారంభించనున్నారు.
జయంతి సందర్భంగా లక్ష తమలపాకులతోపాటు ఓ భక్తుడు సమర్పించిన 11 రకాల పండ్లతో సుందరంగా అలంకరించారు. యాగశాలలో వేదపండితులు, అర్చకులు త్రైయాహ్నిక త్రికుండాత్మక యజ్ఞాన్ని శాస్ర్తోక్తంగా నిర్వహించి పూర్ణాహుతి చేశారు.
కాగా, ఉత్సవాల్లో తొలి రోజు, రెండో రోజు సాయంత్రం వరకు భుక్తుల రాక నామమాత్రంగానే ఉండ గా.. శుక్రవారం సాయంత్రం నుంచి భక్తుల రాక ప్రారంభమైంది. రాత్రి ఏడు గంటల తర్వాత ప్రవాహంలా సాగింది. వివిధ ప్రాం తాల నుంచి పాదయాత్రగా తరలివచ్చిన దీక్షాపరులు గుట్ట కింద సేదతీరి ఎండ తగ్గగానే గుట్ట మీదికి వెల్లువలా తరలివచ్చారు. దీక్షలను విరమించి తర్వాత తలనీలాలు సమర్పించి, పుష్కరిణిలో పుణ్య స్నానాలు ఆచరించి, స్వామి వారిని దర్శించుకున్నారు.