కరీంనగర్ కలెక్టరేట్, జూలై 11 : రాష్ట్ర ప్రభుత్వానికి నిరంతర ఆదాయ వనరు అయిన గ్రానైట్ పరిశ్రమ యజమానులు, కార్మికులు శుక్రవారం రోడ్డెక్కారు. పరిశ్రమ మనుగడ ప్రశ్నార్థకమయ్యేలా రూపొందించిన జీవో నంబర్ 14, 16ను వెంటనే రద్దు చేయాలని కరీంనగర్ వీధుల్లో కదం తొక్కారు. వేలాది కుటుంబాల జీవనాధారం కోసం 2023లో విడుదల చేసిన జీవోనంబర్ 4ను మరో రెండేళ్లపాటు అమలు చేయాలంటూ మహా ర్యాలీ నిర్వహించారు. మంకమ్మతోట పెట్రోల్ బంక్ నుంచి మొదలై తెలంగాణ చౌక్, ప్రతిమ మల్టీప్లెక్స్ మీదుగా కలెక్టరేట్ వరకు సాగింది. కరీంనగర్ జిల్లా గ్రానైట్ క్వారీ యజమానుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీలో వందలాది మంది గ్రానైట్ క్వారీల యజమానులు, వేలాది మంది కార్మికులు నిరసన తెలిపారు.
అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసి, తమ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. అనంతరం సంఘం జిల్లా అధ్యక్షుడు ఐ విజయభాస్కర్ మాట్లాడుతూ, ఈ నెల 8న రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవోల ప్రకారం ప్రతి క్యూబిక్ మీటర్‌కు 1,435 ప్రస్తుతం చెల్లిస్తున్న టాక్సీకి అదనంగా చెల్లించాల్సి ఉంటుందన్నారు. మూడేళ్ల క్రితమే రాయల్టీ పెంచగా, కరోనా తర్వాత ఎదురవుతున్న సమస్యలతో గ్రానైట్ పరిశ్రమ అచేతన స్థితికి చేరుకుందని, తాజాగా 20 శాతం టాక్స్ పెంచడంతో మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు తమ పరిస్థితి తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. రాయల్టీ చెల్లింపుతో పాటు గ్రానైట్ రవాణా చార్జీలు మొత్తం కలిపి అమ్మకం ధరలో 65 శాతానికి పైగా ఖర్చవుతున్నట్టు వాపోయారు.
ప్రభుత్వం అందించే రాయితీలు కుదిస్తూ, పన్నులు మాత్రం ఇబ్బడి ముబ్బడిగా పెంచుతుండడంతో నష్టాలు మీద పడుతున్నాయని, వరుస నష్టాలు భరించలేక వందల సంఖ్యలో క్వారీలు మూతపడ్డాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే సమయంలో గతేడాది కాలంగా ఆంధ్రప్రదేశ్‌తోపాటు కర్ణాటక, ఒడిశా రాష్ర్టాల్లో గ్రానైట్ పరిశ్రమను ఆదుకునేందుకు ప్రస్తుతమున్న టాక్సీలు తగ్గించి, 10 శాతం మాత్రమే వసూలు చేస్తున్నాయని, దీంతో తెలంగాణకు చెందిన బయ్యర్లు, కార్మికులు ఆయా రాష్ర్టాలకు తరలివెళ్తున్నారని తెలిపారు. జిల్లాలో 350కి పైగా గ్రానైట్ పరిశ్రమలకుగానూ ప్రస్తుత పరిస్థితుల్లో 60 నుంచి 70 మాత్రమే పనిచేస్తుండగా, తాజాగా విడుదలైన జీవోలతో ఇవి కూడా మూతపడే స్థితికి చేరుతున్నాయన్నారు.
జిల్లాలో 30వేలకు పైగా కార్మికుల కుటుంబాలను పోషిస్తున్న ఈ పరిశ్రమను ఆదుకోకపోతే, ప్రభుత్వాదాయం తగ్గడంతోపాటు కుటుంబాలు అంధకారంలో పడుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఆందోళనలో గ్రానైట్ క్వారీ ఓనర్స్ అసోసియేషన్ జిల్లా గౌరవాధ్యక్షుడు జీ సుధాకర్, తిరుపతిగౌడ్, వంశీకృష్ణ, నాయకులు సతీశ్‌రెడ్డి, కృష్ణ కాల్వ, జిత్తువ్యాస్, సతీశ్‌రెడ్డి, మల్లారెడ్డి, కన్నూరి సురేశ్‌తో పాటు వంద మందికి పైగా గ్రానైట్ క్వారీ ఓనర్లు, మూడువేల మందికిపైగా కార్మికులు పాల్గొన్నారు.