కార్పొరేషన్, డిసెంబర్ 11: కరీంనగర్ నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాల్లో రోడ్ల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 75 కోట్లను మంజూరు చేసిందని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. ఆదివారం స్థానిక మంత్రి క్యాంపు కార్యాలయం మీసేవాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలో 2014 నుంచి కొత్తపల్లి, కరీంనగర్ రూరల్ మండలాల్లో అత్యధిక శాతం రోడ్లను అభివృద్ధ్ది చేశామన్నారు. కాగా ప్రస్తుతం ఆయా మండలాల్లోని రోడ్ల మరమ్మతులు, కొత్త రోడ్ల నిర్మాణానికి గాను రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.59.30 కోట్ల నిధులు వచ్చాయన్నారు.
వీటిల్లో ఆరు రోడ్ల నిర్మాణం చేస్తున్నామని పేర్కొన్నారు. ఇంటర్నల్ రోడ్లు, ఇతర ఆర్అండ్బీ, పంచాయతీ రాజ్ రోడ్లను కూడా మరమ్మతుతో పాటు, కొత్తగా నిర్మాణం చేస్తున్నామని తెలిపారు. కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో గతంలో వేసిన ప్రధాన రహదారులు ఇటీవల కురిసిన వర్షాలు, ఇతర అభివృద్ధి పనుల కారణంగా అక్కడక్కడ మరమ్మతుకు చేరాయన్నారు. వీటిని రూ.40 కోట్లతో రినీవల్ కోట్ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రస్తుతం మంజూరైన నిధులతో డిసెంబర్లోనే టెండర్లు నిర్వహించి పనులు ప్రారంభిస్తామన్నారు. వచ్చే మార్చి 31లోగా అన్ని రోడ్ల పనులను పూర్తి చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో నగర మేయర్ యాదగిరి సునీల్‌రావు, కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు, ఎంపీపీలు లక్ష్మయ్య, శ్రీలత, మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డవేని మధు, నాయకులు వాసాల రమేశ్ తదితరులు పాల్గొన్నారు.