FRS | ధర్మపురి, ఆగస్టు 12 : ఉపాధ్యాయుల హాజరు నమోదు కోసం ఫేసియల్ రికగ్నైజేషన్ సిస్టమ్ (ఎఫ్ఆర్ఎస్) విధానాన్ని విద్యాశాఖ ఆగస్టు 1న ఆడంబరంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. పాఠశాల విద్యాశాఖలో డీఎస్ఈ- ఎఫ్ఆర్ఎస్ అనే యాప్ ఉండగా.. రెండేళ్లుగా విద్యార్థుల హాజరు ఎస్ఆర్ఎస్ విధానంలోనే మొబైల్ సాయంతో తీసుకుంటున్నారు. అయితే తాజాగా ఉపాద్యాయుల హాజరుపైనా విద్యాశాఖ దృష్టి సారించింది. విద్యాశాఖ సంచాలకుల ఆదేశాల మేరకు తాజాగా డిఎస్ఈ ఎఫ్ఆర్ఎస్ యాప్‌లో స్టాఫ్ రిజిస్ట్రేషన్, స్టాఫ్ అంటిండెన్స్ పేరిట కొత్త మాడ్యూళ్లను పొందుపరిచింది. ఉపాధ్యాయులందరూ పాఠశాల విద్యాశాఖ రికగ్నైజేషన్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకొని ప్రారంభమైన రోజు నుండి మూడు రోజులు ఉపాధ్యాయులు పనిచేసే పాఠశాల ఆవరణలోనే ఉపాధ్యాయుల హాజరును యాప్ ద్వారా నమోదు చేసుకున్నారు. అయితే ఇది మూడు రోజుల వరకే పరిమితమైంది. ప్రారంభమైన మొదటి మూడు రోజులు పాఠశాల ఆవరణ కాకుండా మరోచోట నుండి నమోదు చేసుకునే ప్రయత్నం చేస్తే హాజరు నమోదు కాలేదు. కేవలం పాఠశాల ఆవరణ నుండి మాత్రమే నమోదు జరిగింది. కానీ మూడు రోజుల తర్వాత నుండి పాఠశాల ఆవరణ కాకుండా ఎక్కడ నుండి చేసినా యాప్‌లో హాజరు నమోదు అవుతున్నది. ఉపాధ్యాయుల ఫేసియల్ రికగ్నైజేషన్ సిస్టం(ముఖ గుర్తింపు) హాజరు సమోదు కోసం రూపొందించిన పాఠశాల విద్యాశాఖ యాప్ గందరగోళంగా మారింది.
జియో ట్యాగింగ్ చొరవ.. ఒక్క క్లిక్‌తో పాఠశాల సమాచారం..
బయోమెట్రిక్ విధానం నుండి డిజిటలైజేషన్, పర్యవేక్షణ వైపు వేసిన ముందడుగులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా పాఠశాల సమచారం కేవలం ఒక్క క్లిక్‌తో పొందేందుకు జియో ట్యాగింగ్ చొరవను విద్యాశాఖ ప్రారంభించిన విషయం విదితమే. అన్ని పాఠశాలల పనితీరును క్రమబద్ధీకరించేందుకు విద్యాశాఖ దృష్టి సారించింది. జియో ట్యాగింగ్ ఆప్లికేషన్‌ను ఉపయోగించి సమాచారాన్ని సేకరించి ఏకీకృతం చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఈ వ్యవస్థ అమలులో ఉండడంతో రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల కార్యకలాపాలు, పనితీరును నిశితంగా పర్యవేక్షించడం ఈ శాఖ లక్ష్యం జియో ట్యాగింగ్ ఆధారంగానే ఆగస్టు 1 నుండి టీచర్ ఎస్ఆర్ఎస్ ను అమలు చేశారు. మొదటి మూడు రోజులు పాఠశాల ఆవరణ నుండి హాజరు నమోదు చేసుకునే విధంగా రూపొందించబడిన ఈ యాప్ ఆ తర్వాత ఎక్కడ నుండైనా నమోదు చేసుకునే విధంగా తయారుకావడం గందరగోళ పరిస్థితులకు దారి తీసింది.
ఉమ్మడి జిల్లాలో 2416 పాఠశాలలు, 13,189 మంది ఉపాధ్యాయులు…
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 2,416 ప్రభుత్వ పాఠశాలలుండగా.. ఇందులో 13,189 మంది ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు. పెద్దపెల్లి జిల్లాలో 532 ప్రభుత్వ పాఠశాలల్లో 2633 మంది ఉపాధ్యాయులు, జగిత్యాల జిల్లాలో 765 పాఠశాలలో 4369 మంది ఉపాధ్యాయులు, కరీంనగర్ జిల్లాలో 631 పాఠశాలల్లో 3644 మంది ఉపాధ్యాయులు, రాజన్నసిరిసిల్ల జిల్లాలో 488 పాఠశాలల్లో 2493 మంది ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు. వీరంతా ఆగస్టు 1 నుండి ఫేసియల్ రికగ్నైజేషన్ సిస్టం యాప్ ద్వారా హాజరు నమోదు చేసుకుంటున్నారు..
టీచర్ ఎస్ఆర్ఎస్ను రోజుకు నాలుగు సార్లు నమోదు చేసుకునేలా యాప్‌ను రూపొందించాలి..
టీచర్ ఎఫ్‌ఆర్‌ఎస్‌ను ప్రస్తుతం రోజుకు రెండు సార్లు నమోదు చేసుకునే విధంగా రూపొందించారు. అయితే రోజుకు రెండు సార్లు కాకుండా నాలుగుసార్లు ఎఫ్ఆర్ఎస్ హాజరు నమోదు చేసుకునే విధంగా అమలు చేస్తే బాగుంటుందని పలువురు విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం అమలులో ఉన్న ఉదయం, సాయంత్రం కాకుండా మద్యాహ్న భోజన విరామ సమయంలో కూడా రెండు సార్లు మొత్తం నాలుగుసార్లుగా హాజరు నమోదు చేసుకునే విధంగా యాప్‌ను రూపొందించాలని విద్యావంతులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఉపాధ్యాయులు మధ్యాహ్నం భోజన విరామంలో పాఠశాల నుండి బయటకు వెళ్లి వ్యక్తిగత పనులు పూర్తిచేసుకొని సాయంత్రం 4 పాఠశాలకు చేరి యాప్‌లో హాజరు నమోదు చేసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
పాఠశాల ఆవరణ మండే నమోదు చేసుకోవాలి : జిల్లా విద్యాధికారి
ప్రతీ పాఠశాలకు జియో ట్యాగింగ్ ఉంది. ఉపాధ్యాయుల హాజరు నమోదును పాఠశాల ఆవరణ నుండే యాప్ ద్వారా నమోదు చేసుకోవాలి. పాఠశాల ఆవరణ నుండే నమోదు చేసుకునేవిధంగా టీచర్ ఎఫ్ఆర్ఎస్ యాప్ రూపొందించబడింది. పాఠశాల ఆవరణ నుండి కాకుండా ఇతర చోట నుండి నమోదు చేసుకుంటే ఎంత దూరం నుండి నమోదు జరిగిందనేది తెలుస్తుంది. ప్రస్తుతం యాప్ టెస్టింగ్ జరుగుతున్నది యాప్ మరింత అభివృద్ధి చేసి పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకువస్తాం. లోపాలుంటే పరీక్షించి సరిచేయడం జరుగుతుందని జిల్లా విద్యాధికారి కే రాము పేర్కొన్నారు.
పాఠశాలలో కంప్యూటర్ ఆపరేటర్‌ను నియమించాలి : టీఎస్సీపీఎస్ఈయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు
ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నాము. ఎఫ్ఆర్ఎస్ వల్ల సమాజంలో ప్రభుత్వ విద్యా వ్యవస్థ పట్ల నమ్మకం ఏర్పడుతుంది. అలాగే దీనిద్వారా ఉపాధ్యాయులకు పాఠశాలలో ఆన్లైన్, బోధనేతర పనుల భారం అధికం కావడం వల్ల విద్యార్థులకు పూర్తిస్థాయిలో ఆశించిన విధంగా అభ్యసన సామర్థ్యాలను చేరుకోలేక పోతున్నారు. కావున ప్రభుత్వం ప్రతీ పాఠశాలలో బోధనేతర పనులకు ఒక కంప్యూటర్ ఆపరేటర్‌ను నియమించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అని టీఎస్సీపీఎస్ఈయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాన్య పవన్ కుమార్ డిమాండ్ చేశారు.