కరీంనగర్ కార్పొరేషన్, జూన్ 27: కేవలం రాష్ట్ర తొలి సీఎం కేసీఆర్‌కు పేరు వస్తుందన్న దురుద్దేశంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరంలోని మేడిగడ్డకు మరమ్మతులు చేయకుండా, నీటిని ఎత్తిపోయకుండా ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మండిపడ్డారు. ఎల్ఎండీ జలాశయం నీటి మట్టం అడుగంటడంతో కరీంనగర్ నగర ప్రజలు తాగునీరు, హుజూరాబాద్, మానకొండూర్ నియోజకవర్గ రైతులకు సాగునీటికి ఇబ్బందులు మొదలైనట్లు తెలిపారు.
ఎల్ఎండీలో నీటిమట్టం తగ్గడంతో బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు శనివారం ఎల్ఎండీలో వినూత్నంగా వివిధ క్రీడలు ఆడి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమానికి గంగుల హాజరై క్రికెట్, హాకీ, వాలీబాల్ తదితర క్రీడలు ఆడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కరీంనగర్ రెండు దశాబ్దాల చరిత్రలో జూలై నెలలో ఎల్ఎండీలో నీటి నిల్వలు డేడ్ స్టోరేజ్‌కి పడిపోవడం ఇదే మొదటిసారి అని పేర్కొన్నారు. కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే ఎల్ఎండీకి ఈ పరిస్థితి దాపురించిందని విమర్శించారు.
ప్రజలకు తాగునీరు, సాగునీరు అందకుండా పోతుందన్నారు. మేడిగడ్డను మరమ్మతులు చేపట్టకపోవడంతో ప్రతిరోజు 10 వేల నుంచి 15 వేల క్యూసెకుల నీరు సముద్రంలో కలుస్తుందన్నారు. ఆ నీటిని నిల్వ చేసి మేడిగడ్డ నుంచి కన్నెపల్లి పంప్‌హౌస్ ద్వారా సుందిళ్ల, అన్నారం, ఎల్లంపల్లికి తరలించి అక్కడి నుంచి వరద కాల్వ ద్వారా మిడ్‌మానేరు, ఎల్ఎండీకి తరలించాలని డిమాండ్ చేశారు. మిడ్‌మానేరుపై ఉన్న వరద కాలువల్లోని వివిధ తూముల ద్వారా నీటిని విడుదల చేస్తే ఆయా గ్రామాల్లోని చెరువులు, కుంటలు నిండుకుండల్లా మారుతాయన్నారు.
వరద కాలువ ఆచంపల్లి దగ్గర ఉన్న తూము ద్వారా నీటిని విడుదల చేస్తే కొత్తపల్లి మండలంలోని బావుపేట, ఎలగందుల, నాగులమల్యాల, బద్దిపల్లి, కమాన్‌పూర్, శ్రీరాములపల్లి, కాజీపూర్ గ్రామ చెరువులు నింపితే రైతులు సాగు చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. సాగునీరు లేకపోవడంతో రైతులు ఇప్పటి వరకు నార్లు పోసుకునే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. కాళేశ్వరం వద్ద వరద నీటిని మళ్లించి కన్నెపల్లి పంపుహౌస్ ద్వారా వెంటనే నీటి ఎత్తిపోతలు మొదలుపెట్టాలని డిమాండ్ చేశారు.
ఈ పనులు చేయడం ప్రభుత్వం చేతకాదని చేతులెత్తేస్తే.. కేసీఆర్ నాయకత్వంలో కేటీఆర్, హరీశ్‌రావు బీఆర్ఎస్ నాయకులతో కలిసి కన్నెపల్లిలో ఉన్న మోటార్లను ఆన్‌చేసి ప్రజలకు నీరందిస్తామన్నారు. ప్రస్తుతం ఎల్ఎండీలో ఐదున్నర టీఎంసీలు మాత్రమే నిల్వ ఉందని ప్రస్తుత వాతావరణ పరిస్థితుల దృష్ట్యా వర్షాలు పడే అవకాశం లేదన్నారు. మూడు టీఎంసీలు డెడ్ స్టోరేజ్‌గా ఉంటుందని కేవలం రెండు టీఎంసీల నీటి ద్వారా కరీంనగర్ ప్రజలకు తాగునీరు అందించలేమన్నారు. బీఆర్ఎస్ హయాంలో ప్రతిరోజు తాగునీరు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు.
కానీ, కాంగ్రెస్ నిర్లక్ష్య ధోరణితో ప్రస్తుతం రెండు మూడు రోజులకు ఒకసారి మంచినీళ్లు అందించే పరిస్థితి వచ్చిందన్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఎల్ఎండీ మీద ఆధారపడి వ్యవసాయం సాగు చేసుకుంటున్న మానకొండూర్, హుజూరాబాద్ నియోజకవర్గాల రైతులకు సాగునీరు లేక రైతులు రోడ్డున పడే పరిస్థితి ఉత్పన్నం అవుతుందన్నారు. బీఆర్ఎస్ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు నీటిని ఎత్తిపోసి ఏప్రిల్, మే నెలలోనే ప్రాజెక్టులన్నింటినీ నింపి తద్వారా చెరువులకు నీరును తరలించి మత్తుడులు దుంకించినట్లు తెలిపారు. కార్యక్రమంలో మాజీ మేయర్ రవీందర్‌సింగ్, బీఆర్ఎస్ కార్పొరేటర్లు గుగ్గిళ్ల జయశ్రీ, రవీందర్, మాజీ కార్పొరేటర్లు మహేశ్, ఎవీ రమణ, బీఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.