వేములవాడ/వేములవాడ రూరల్/చందుర్తి, డిసెంబర్ 28: అర్హులంద రికీ సంక్షేమ ఫలాలు అం దించేందుకే ప్రజాపాలన కార్యక్రమాకి శ్రీకారం చుట్టామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సూచించారు. వేములవాడ మున్సిపాలిటీ పరిధిలోని 3, 4 వార్డుల్లో, వేములవాడ మండలం కొడుముంజలో, చందుర్తి మండలంలోని నర్సింగాపూర్‌లో ప్రజా పాలన కార్యక్రమానికి హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ప్రజా పాలన కార్యక్రమం చేపట్టి ఆరు గ్యారెంటీల అమలుకు శ్రీకారం చుట్టిందన్నారు. 100 రోజుల్లో అర్హులకు ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు.
వేములవాడ పురపాలక సంఘం పరిధిలో నాలుగు వార్డులు కార్యాలయంతో కలిపి మొత్తం1,247 దరఖాస్తులు వచ్చాయని అధికారులు తెలిపారు. కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి, ఆర్డీవో మధుసూధన్, ఇన్చార్జి కమిషనర్, తహసీల్దార్ మహేశ్, కౌన్సిలర్లు నిమ్మశెట్టి విజయ్, మారం కుమార్, మేనేజర్ సంపత్‌రెడ్డి, అధికారులు ఉన్నారు. కొడుముంజలో ఎంపీపీ బూర వజ్రమ్మ, జడ్పీటీసీ రవి, ఎంపీ పీ వజ్రమ్మ, వైస్ ఎంపీపీ ఆర్సీరావు, డీపీఆర్వో రవీందర్, ప్రత్యేకాధికారి మహేశ్, ఎంపీడీవో శ్రీధర్, పాల్గొన్నారు. చొప్పదండి మండలం నర్సింగాపూర్‌లో జడ్పీటీసీ నాగం కుమార్, ఎంపీపీ బైరగోని లావణ్య, ఎమ్మార్వో శ్రీనివాస్, ఎంపీవో ప్రదీప్, సర్పంచ్ గంగాధర్, ఉప సర్పంచ్, నాయకులు రామస్వామి ఉన్నారు.