Government promises | జగిత్యాల, సెప్టెంబర్ 3 : ఉద్యోగుల, ఉపాధ్యాయుల పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి టీజీఈ జేఏసీ నేతలకు సర్కారు మంగళవారం ఇచ్చిన హామీలు సత్వరమే నెరవేర్చాలని తెలంగాణ పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో ఆయన విలేకరులతో బుధవారం మాట్లాడారు.
ఉద్యోగుల ఆరోగ్య పథకంపై వారంలో విధివిధానాలు ఖరారు చేస్తామని, జేఏసీ నేతలు ప్రతిపాదించిన డిమాండ్లను దశలవారీగా పరిష్కారానికి మంత్రివర్గ ఉప సంఘం, అధికారుల కమిటీ ఇచ్చిన హామీ జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళన కార్యాచరణ ఫలితమేన్నారు. ఏంతో ఆశతో ఎదురుచూస్తున్న పీఆర్సీపై కూడా ప్రభుత్వం ప్రకటన చేయాలని, పెన్షనర్ల సమస్యలన్నీ పరిష్కరించాలని కోరారు.
ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పీసీ హన్మంత రెడ్డి, సహాయ అధ్యక్షుడు బొల్లం విజయ్, కోశాధికారి గౌరిశెట్టి విశ్వనాథం, ఉపాధ్యక్షులు వెల్ముల ప్రకాష్ రావు, ఎండీ యాకూబ్, సంయుక్త కార్యదర్శులు దిండిగాల విఠల్, కట్ట గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.