కమాన్చౌరస్తా, జూన్ 22: విద్యార్థులపై బడి సంచి భారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం గత విద్యాసంవత్సరం నుంచి ప్రతినెలా నాలుగో శనివారం ‘నో బ్యాగ్డే’ను అమల్లోకి తెచ్చింది. స్కూల్ బ్యాగు పాలసీ-2020 ప్రకారం ఏడాదిలో పది రోజులు పకడ్బందీగా అమలు చేయాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించింది. ప్రతి నెలా నాలుగో శనివారం ఒకటి నుంచి టెన్త్ క్లాస్ విద్యార్థుల వరకు ఎలాంటి కార్యకలాపాలు చేపట్టాలో నిర్దేశిస్తూ ఎన్సీఈఆర్టీ ప్రత్యేక పుస్తకాన్ని ముద్రించింది. అందులో 28 కృత్యాలను పొందుపరిచింది. వీలును బట్టి చేయించాలని సూచించింది.
మ్యూజియం, చారిత్రక ప్రదేశాలు, గ్రామ పంచాయతీలు వంటి కార్యాలయాల సందర్శన, సైన్స్ ప్రయోగాలు, బాలికా విద్యపై సిట్, పతంగుల తయారీ, ఆర్టిఫిషీయల్ ఇంటెలిజెన్స్, మ్యాథ్స్ కార్నర్, మ్యాథ్స్ రంగోలి, మోడల్ ఎన్నికలు, మాక్ అసెంబ్లీ, ఆర్థిక లావాదేవీల నిర్వహణ, బేస్డ్ లెర్నింగ్ లాంటి కార్యక్రమాలు అన్ని పాఠశాలల్లో తప్పనిసరిగా నిర్వహించాలి. కానీ, ఈ యేడాది మొదటిలోనే ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో అందుకు ఎగనామం పెట్టారు. అయితే, ఈ నాలుగో శనివారం గంగాధర మండలం బూరుగుపల్లి, రామడుగు మండలం వెదిర జడ్పీ పాఠశాలలను కరీంనగర్ డీఈవో జనార్దన్రావు ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంలో విద్యార్థులు బ్యాగులతో కనిపించినా పట్టించుకోలేదని తెలుస్తున్నది.