కొడిమ్యాల, జూన్ 10 : జాఫార్ఖాన్ చెరువు నుంచి మట్టి తరలింపును ఆపాలని, చెరువును కాపాడాలని నమిలికొండ అనుబంధ గ్రామమైన గోపాల్రావుపేట గ్రామస్తులు, మత్స్యకారులు డిమాండ్ చేశారు. సోమవారం చెరువు వద్ద ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మట్టి తరలింపు వల్ల కట్ట తెగే ప్రమాదం ఉందని, మత్స్యకారులకు చేపలు పట్టడానికి ఇబ్బంది అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కొంత మంది రియల్టర్లు అనుమతుల పేరిట చెరువులో ఎక్కువ లోతు మట్టిని తవ్వి తీసుకెళ్తున్నారని ఆరోపించారు.
దీనిపై వారం క్రితం ఇరిగేషన్ అధికారులకు వినతి పత్రం సమర్పించామని, అయినా ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోయారు. ఇప్పటికైనా ఆపకపోతే ఆమరణ దీక్ష చేపడుతామని స్పష్టం చేశారు. ఆందోళనలో బండ నర్సింహారెడ్డి, కోమటి చంద్రశేఖర్, పర్షరాములు, కాసాం లక్ష్మీరాజం, మనోహర్‌రెడ్డి, కోమటి లచ్చయ్య, బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌కు చెందిన నాయకులు పాల్గొన్నారు.