కోల్ మాఫియా కోరలు చాస్తున్నది. కొద్దిరోజులుగా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో చెలరేగిపోతున్నది. సింగరేణి నుంచి ఎన్టీపీసీకి రవాణా చేసే రైల్వే వ్యాగన్ల నుంచి సరుకును లూటీ చేస్తున్నది. గతంలో పీడీ యాక్టులు, కేసులతో కొంత వెనకి తగ్గినా, ఇటీవలి కాలంలో మళ్లీ దందా మొదలు పెట్టింది. లక్ష్మీపురం, మారేడుపాక, ఎలలపల్లి గేట్ల సమీపంలో ముఠాలు ఏర్పరుచుకొని, ప్రతి రోజూ తెల్లవారుజామున 2 నుంచి 5 గంటల మధ్య రైలు ఆగగానే పైకి ఎక్కి అందినకాడికి దోచుకుంటున్నది. గుట్టుచప్పుడు కాకుండా కరీంనగర్ జిల్లాలోని ఇటుక బట్టీలు, హైదరాబాద్‌ల్లోని పరిశ్రమలకు సరఫరా చేసి సొమ్ము చేసుకుంటున్నది.
..ఈ చిత్రంలోని బొలెరో క్యాంపర్‌లో కనిపిస్తున్నది సింగరేణి బొగ్గు. ఈ నెల 7న ఆర్జీ-2 పరిధిలోని లక్ష్మీపూర్ వద్ద రైల్వే వ్యాగన్ల నుంచి అక్రమంగా తీసి లోడ్ చేయగా, సింగరేణి ఆర్జీ-1 సీనియర్ సెక్యూరిటీ అధికారి ఎం వీరారెడ్డి, తన సిబ్బందితో అక్కడికి వెళ్లి స్వాధీనం చేసుకున్నారు. బొగ్గు విలువ దాదాపుగా రూ.15వేల దాకా ఉంటుంది.
.. పై ఫొటోలో కనిపిస్తున్నది ఆర్జీ-2 పరిధిలో అక్రమంగా తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్న సింగరేణి బొగ్గు. ఎల్కలపల్లి శివారులోని పోచమ్మ ఆలయం వద్ద ట్రాక్టర్లో బొగ్గు లోడ్ చేసి ఉండగా, సమాచారం మేరకు ఆర్జీ-2 సీనియర్ సెక్యూరిటీ అధికారి షరీఫ్ వెళ్లి ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ బొగ్గు విలువ దాదాపు రూ.18వేల వరకు ఉంటుంది.
పెద్దపల్లి, జనవరి 20(నమస్తే తెలంగాణ): సింగరేణి బొగ్గుకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. డీ గ్రేడు ధర టన్నుకు రూ.2800 నుంచి రూ.3 వేలు పలుకుతున్నది. బహిరంగ మార్కెట్లో మాత్రం అంతకు రెండు, మూడింతలు వచ్చే అవకాశాలతో మాఫియా కన్నేసింది. రైల్వే వ్యాగన్ల నుంచి చోరీ చేస్తూ తరలించుకుపోతున్నది.
సింగరేణి ఉత్పత్తి చేసే బొగ్గును ఎన్టీపీసీ తన అవసరాల కోసం తరలించుకుంటున్నది. ఇందుకు ప్రత్యేక రైల్వే లైన్ నుంచి రేకుల ద్వారా తీసుకెళ్తుంది. ఆర్జీ-1 సీఎస్పీ, ఓసీపీ-3 సీఎస్పీ, ఓసీపీ-1 సైలోల నుంచి రవాణా జరుగుతుంది. రేకులు కూడా వారికి కేటాయించిన టైమ్ టేబుల్ ప్రకారం వెళ్తాయి. ఈ రైలు వెళ్లే టైంనే స్మగ్లర్లు అక్రమ రవాణాకు అడ్డాగా మల్చుకున్నారు. చీకటి పడిందంటే చాలు రైలు మార్గం ఉన్న మారేడుపాక, లక్ష్మీపురం, ఎలలపల్లి గేట్ల మధ్య పదుల సంఖ్యలో ముఠాలు వ్యాగన్ల పైకి ఎక్కి వాటి పై నుంచి బొగ్గును లూటీ చేస్తున్నారు. ఎవరూ కనిపించని నిర్దేశిత ప్రాంతంలో బొగ్గును కింద పడేస్తుండగా, కింద ఉండే సహచరులు ఒకచోటికి చేర్చి, వెంట తెచ్చుకున్న ట్రాక్టర్లు, బొలెరో క్యాంపర్లు, ట్రక్కుల్లో లోడ్ చేస్తున్నారు. రహస్య ప్రాంతాల్లో డంపు చేస్తూ, ఎంచుకున్న ప్రదేశాలకు తీసుకువెళ్లి టన్నుకు రూ.3వేల నుంచి రూ.10వేల దాకా విక్రయిస్తున్నారు. జిల్లా అధికారుల కండ్లు గప్పి ఉమ్మడి జిల్లాలోని ఇటుక బట్టీలతో పాటు హైదరాబాద్ ప్రాంతంలోని పరిశ్రమలకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది.
దేశంలోనే అతి పెద్ద పరిశ్రమలుగా ఉన్న సింగరేణి, ఎన్టీపీసీ సంస్థలు ప్రభుత్వం మాదిరి అన్ని రకాల ప్రత్యేక వ్యవస్థలను కలిగి ఉన్నాయి. ప్రత్యేక రక్షణ విభాగాలతో నడుస్తున్నాయి. అలాంటి అతి పెద్ద కంపెనీలు చేసే వ్యాపారం, వినియోగం విషయంలో పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని చెప్పడానికి చోరీ ఘటనలే ఉదాహరణగా నిలుస్తున్నాయి. గతంలో సింగరేణి, ఎన్టీపీసీ రక్షణ విభాగాలతో పాటు పోలీస్ శాఖ కలిసి ఉమ్మడిగా నిఘా పెట్టి తనిఖీలు చేసి పకడ్బందీగా చోరీలను అరికట్టాయి. ఇటీవల ఆయా శాఖల మధ్య సమన్వయం కొరవడింది. తమ గనుల పరిధి దాటిన బొగ్గుతో తమకు సంబంధం లేదని సింగరేణి అంటుంటే, సింగరేణిదే బాధ్యత అంటూ ఎన్టీపీసీ భావిస్తుండడంతో స్మగ్లింగ్ యథేచ్ఛగా సాగుతున్నది. అయితే, ఈ లూటీకి ఆయా సంస్థల రక్షణ విభాగాలు కూడా పరోక్షంగా సహకరిస్తున్నాయనే ప్రచారం ఉన్నది.
సింగరేణి బొగ్గు లూటీ అవుతున్న నేపథ్యంలో అటు సింగరేణి అధికారులు, ఇటు ఎన్టీపీసీ యాజమాన్యం పట్టించుకోవడం లేదు. ఏదో నామ్‌కే వాస్తేగా అప్పుడప్పుడు సింగరేణి భద్రతా సిబ్బంది దాడులు చేసి, కేవలం వేల రూపాయల విలువైన బొగ్గును మాత్రమే పట్టుకుంటున్నాయని, రూ.లక్షల విలువైన బొగ్గును పట్టించుకున్న పాపాన పోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. పట్టుబడ్డ సందర్భాల్లో సిబ్బందికి మామూళ్లు ముట్టజెప్పితే వదిలి పెడుతున్నారనే ఆరోపణలు లేకపోలేదు. బొగ్గు స్మగ్లింగ్ వల్ల అటు సింగరేణి, ఇటు ఎన్టీపీసీ, గూడ్స్ రైల్ సిబ్బంది, పోలీసులకు నెల నెలా మామూళ్లు అందుతున్నట్లు ప్రచారం జరుగుతున్నది.
జిల్లాలో ఇటీవల వరుసగా రెండుసార్లు అక్రమంగా బొగ్గును తరలిస్తుంటే భద్రతా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇది సింగరేణి నుంచి ఎన్టీపీసీకి తరలిస్తుండగా రైల్వే బోగీల నుంచి చోరీ చేసిన బొగ్గు అని, అయితే డ్రైవర్ రైలును ఆపడం వల్లే చోరీ జరిగినట్లుగా గుర్తించారు. అయితే, 7న లక్ష్మీపూర్ క్రాస్ దగ్గర స్వాధీనం చేసుకున్న బొగ్గు ఆర్జీ-1 ఏరియాలో పట్టుకోగా, అది ఆర్జీ-2కు సంబంధించిన బొగ్గుగా భావిస్తున్నారు. స్వాధీనం చేసుకున్న బొగ్గుపై కేసు నమోదు చేసి ఠాణాకు తరలించారు. ఆర్జీ-1 సీఎస్పీలో అన్లోడ్ చేశారు. అలాగే, 9న ఎల్కలపల్లి వద్ద ట్రాక్టర్లో లోడ్ చేసి తరలిస్తున్న బొగ్గును ఆర్జీ-2 భద్రత అధికారులు స్వాధీనం చేసుకొని, గోదావరిఖని టూటౌన్ ఠాణాకు తరలించారు. అయితే, ఈ రైల్వే బోగీల్లో అటు ఆర్జీ-1 బొగ్గు, ఆర్జీ-2బొగ్గు తరలిస్తున్నారు. అయితే, ఈ బొగ్గు ఎవరు లోడ్ చేశారనేది మాత్రం తేలడం లేదు. పోలీసులు ఇప్పటివరకు ఒక్కరిని కూడా అరెస్ట్ట్ చేయలేదు.
రెండు ఘటనలతో సింగరేణి బొగ్గు చోరీకి గురవుతున్నట్లు గుర్తించాం. కట్టడి చేసేందుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నాం. జరుగుతున్న చోరీలపై ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చాం. పోలీసులు, ఇంటిలిజెన్స్ అధికారులు పూర్తిగా విచారణ జరుపుతున్నారు. ఎన్టీపీసీ, రైల్వే పోలీసు సైతం దీనిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. లోడింగ్ వరకే తమకు సంబంధం ఉంటుంది. లోడింగ్ చేసి ట్రాన్స్పోర్ట్ చేస్తున్న సమయంలో ఎన్టీపీసీ, ఆర్పీఎఫ్ వాళ్లే చూసుకోవాలి. ఇందుకు గాను వారికి లెటర్ పెట్టాం.
– షరీఫ్, ఆర్జీ-2 సీనియర్ సెక్యూరిటీ అధికారి (రామగుండం)