కరీంనగర్ రాంనగర్, మే 29: కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఈ నెల 3న జరిగిన పీఎంజే జ్యువెల్లరీ దోపీడీ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అందులో ఇప్పటి వరకు ముగ్గురిని అరెస్ట్ చేసిన విషయం విదితమే. అయితే దోపిడీని సవాల్‌గా తీసుకున్న పోలీసులు, అదే రోజు నుంచి దొంగలను పట్టుకునేందుకు కంటిమీద కునుకు లేకుండా ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలో దోపిడీదారులు వినియోగించిన ఒక బైక్‌తోపాటు పగులగొట్టిన సెల్‌ఫోన్ దొరకడంతో దోపిడీకి సంబంధించి కీలక సమాచారం సేకరించారు.
లూటీకి నాయకత్వం వహించిన రఘునాథ్ కర్మాకర్‌తోపాటు రవిశ్ కుమార్, వీరికి సెల్‌ఫోన్ సిమ్‌లు అందించిన మెహతాబ్‌ను ఈ నెల 14న అరెస్ట్ చేసి కరీంనగర్ జైలుకు తరలించారు. దోపిడీకీ స్కెచ్ వేసింది ‘ది గోల్డెన్ థీఫ్’ ముఠా నాయకుడు సుబోధ్‌సింగ్‌గా గుర్తించి, అనేక రాష్ర్టాల్లో విచారించారు. ఒక్క బీహార్ రాష్ట్రంలోనే 40పైకి పైగా దోపిడీ, హత్యా నేరం కేసులు ఉన్నట్టు తెలియడంతో నివ్వెరపోయారు. ప్రస్తుతం సుభోద్‌సింగ్ బిహార్ రాష్ట్రంలోని పూర్ణియా జైలులో ఉన్నట్టు ధ్రువీకరించుకొని, అతన్ని సైతం విచారణ కోసం తమ కస్టడీకి తీసుకునేందుకు కరీంనగర్ పోలీసులు ప్రయత్నాలు చేశారు.
ఒక ఇన్స్పెక్టర్ పర్యవేక్షణలో ఒక ఎస్ఐ, పది మంది సిబ్బంది ఈ నెల 15 నుంచి సుభోద్సింగ్ను వారెంట్‌పై తీసుకు వచ్చేందుకు బిహార్‌కు వెళ్లి, 13 రోజులపాటు అక్కడే వేచి చూశారు. అక్కడి ఆరు కోర్టుల్లో పిటిషన్ దాఖలు చేశారు. అయితే సుబోథ్సింగ్పై దోపిడీ, హత్యనేరాలకు సంబంధించి అనేక కేసులు ఉండడంతో అక్కడి కోర్టులు కరీంనగర్ పోలీస్ కస్టడీకి అప్పగించేందుకు కొంత సమయం తీసుకున్నట్టు తెలిసింది. తర్వాత ఆరు కోర్టుల నుంచి ప్రత్యేక అనుమతి ద్వారా సుబోధ్ సింగ్‌ను గురువారం అర్ధరాత్రి కరీంనగర్‌కు తీసుకొచ్చి, మేజిస్ట్రేట్ ఎదుట హాజరు పరిచారు. అనంతరం కరీంనగర్ జైలుకు తరలించి, సాధారణ ఖైదీ మాదిరిగా ఉంచారు.
జ్యువెల్లరీలో దోపిడీ చేసి 161.4 తులాల బంగారు ఆభరణాలు, 112 క్యారెట్ వజ్రాభరణాలను ఎవరి ద్వారా ఎక్కడికి తరలించారు? ప్రస్తుతం ఆ ఆభరణాలు ఎవరి వద్ద ఉన్నాయి? అనే అంశంపై విచారణ కోసం కస్టడీకి తీసుకునేందుకు కరీంనగర్ టూటౌన్ పోలీసులు కరీంనగర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు అనుమతి కోసం వేచి చూస్తున్నారు. పిటిషన్‌పై సోమవారం విచారణ జరగనుండగా, ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
కరీంనగర్ జైలులో రిమాండ్ పరంగా ఉన్న ఖైదీలు మాత్రమే ఉంటారు. అయితే దోపిడీ కేసులో మోస్ట్వాటెండ్గా ఉన్న సుభోద్‌సింగ్, రఘునాథ్ కర్మాకర్, రవిశ్ కుమార్, మెహతాబ్‌ను ప్రస్తుతం ఇక్కడే ఉంచారు. వారి భద్రత పరంగా ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉన్నట్టు తెలిసింది. దాంతో హైదరాబాద్ సెంట్రల్ జైలుకు తరలించడానికి జైలు శాఖ అధికారులు కోర్టు అనుమతి కోరనున్నట్లు తెలిసింది. పోలీస్ కస్టడీ అనంతరం వారిని తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం.
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కరీంనగర్ పీఎంజే జ్యువెల్లరీ దోపిడీ కేసులో ‘ది గోల్డెన్ థీఫ్’ ముఠా నాయకుడు సుబోధ్‌సింగ్‌ను కరీంనగర్ పోలీసులు ఎట్టకేలకు తీసుకొచ్చారు. బిహార్ రాష్ట్రంలోని పూర్ణియా జైలు నుంచి ప్రత్యేక భద్రత మధ్యన ఉమ్మడి జిల్లాకేంద్రానికి గురువారం అర్ధరాత్రి తీసుకొచ్చి, మేజిస్ట్రేట్ ఎదుట హాజరు పరిచిన తర్వాత జిల్లా జైలుకు తరలించారు. ఇప్పటికే లూటీకి నాయకత్వం వహించిన రఘునాథ్ కర్మాకర్‌తోపాటు రవిశ్ కుమార్, వీరికి సెల్‌ఫోన్ సిమ్‌లు అందించిన మెహతాబ్‌ను అరెస్ట్ చేసి జైలులోనే ఉంచారు. నేడు కస్టడీ పిటిషన్‌పై విచారణ జరుగనుండగా, పోలీసులు విచారణ కోసం ఎదురుచూస్తున్నారు.