కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు
పలు గ్రామాల్లో సర్కారు స్కూళ్ల సందర్శన
అభివృద్ధి పనులు ప్రారంభం
ఇంటింటికీ వెళ్లి కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ
కోరుట్ల రూరల్, ఫిబ్రవరి 25: ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా రాష్ట్ర సర్కారు మన ఊరు మన బడి కార్యక్రమాన్ని రూపొందించిందని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు పేర్కొన్నారు. మండలంలోని ఐలాపూర్, ధర్మారం గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలను శుక్రవారం సందర్శించి పాఠశాలల్లో చేపట్టే అభివృద్ధి పనులను ప్రజాప్రతినిధులు, పాఠశాలల యాజమాన్య కమిటీ సభ్యులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రభుత్వం ఎంపిక చేసిన పాఠశాలల్లో చేపట్టే అభివృద్ధి పనుల జాబితా, వాటి ప్రతిపాదనలను తయారు చేయాలని సంబంధిత ఏఈకి సూచించారు. ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుకెళ్తున్నారన్నారు. కాగా, పాఠశాలల్లో చేపట్టాల్సిన పనులపై యాజమాన్య కమిటీ, ప్రధానోపాధ్యాయులతో కలిసి చర్చించారు. అలాగే పాఠశాలల్లోని సౌకర్యాలు ఎలా ఉన్నాయని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి విద్యార్థులకు భోజనాన్ని వడ్డించారు. అంతకుముందు ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావుకు ఘన స్వాగతం పలుకగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ర్యాలీగా పాఠశాలకు చేరుకున్నారు.
కాగా, గ్రామానికి చెందిన ముగ్గురికి కల్యాణలక్ష్మి చెక్కులను స్వయంగా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి అందజేశారు. గ్రామంలో రూ.20లక్షలతో చేపట్టే సీసీ రోడ్డు నిర్మాణానికి భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావును గజమాలతో ఘనంగా సత్కరించారు. ఆయా కార్యక్రమాల్లో సర్పంచులు పిడుగు రాధ, ఇప్ప మంగ, ఎంపీపీ తోట నారాయణ, జిల్లా సర్పంచుల ఫోరం గౌరవాధ్యక్షుడు దారిశెట్టి రాజేశ్, జిల్లా రైతుబంధు అధ్యక్షుడు చీటి వెంకట్రావ్, ఉప సర్పంచ్ గడప అంజమ్మ, ఎంపీటీసీ సభ్యులు చింతకుంట వనిత, బోడ గంగాధర్, నాగిరెడ్డి సుభాష్ రెడ్డి, సహకార సంఘం అధ్యక్షులు చింతకుంట సాయిరెడ్డి, ఇన్చార్జి ఎంఈవో గంగుల నరేశం, ఇన్చార్జి ఎంపీడీవో నీరజ, పంచాయతీ రాజ్ ఏఈ ఆదిత్య, పంచాయతీ పాలకవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.