GodavariKhani | కోల్ సిటీ, జూన్ 21: ప్రపంచ సంగీత దినోత్సవం పురస్కరించుకొని గోదావరి కళా సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో గోదావరిఖనిలో నిర్వహించిన సంగీత విభావరి విశేషంగా ఆకట్టుకుంది. స్థానిక సమాఖ్య భవన్ లో శనివారం జరిగిన కార్యక్రమంలో పలువురు కళాకారులు పాల్గొని తమ ఆటాపాటలతో అలరించారు. ఈ సందర్భంగా జానపద రంగంలో రాణిస్తున్న ప్రఖ్యాత దాసరి రామస్వామి, కొత్త భూమయ్యలకు కళారత్న పురస్కారాలు ప్రదానం చేసి శాలువాలతో ఘనంగా సన్మానించారు.
అనంతరం పలువురు కళాకారులు కీర్తనలు, భక్తి పాటలు, మధుర గీతాలతో ప్రేక్షకులను మైమరిపించారు. సమాఖ్య అధ్యక్షులు కనకం రమణయ్య మాట్లాడుతూ కళలకు, కళాకారులకు పుట్టినిల్లుగా కళాక్షేత్రంగా పేరొందిన ఇక్కడ కళాకారుల కోసం కళాభవన్ నిర్మాణంకు ప్రజాప్రతినిధులు, అధికారులు కృషి చేయాలని కోరారు. ఎంతో మంది జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కళాకారులను అందించిన గొప్ప క్షేత్రం రామగుండం అనీ, ఈ ప్రభుత్వం కళాకారుల సంక్షేమంకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.
అనంతరం స్థానిక కళాకారులకు జ్ఞాపికలను బహుకరించారు. రమణయ్య అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సీనియర్ కళాకారులు మాదరి శ్రీనివాస్, కాసిపాక రాజమౌళి, నాగుల శ్రీనివాస్, సోగాల వెంకటి, మేజిక్ రాజా, రేణికుంట్ల రాజమౌళి, వెంకటేశ్వర రావు, అంజలి, మాధవి, పరమాత్మ, నూకల మొండి తదితరులు పాల్గొన్నారు.