చందుర్తి, అక్టోబర్ 26 : ఆ చిన్నారికి ఏడాదిన్నరకే నిండు నూరేండ్లు నిండాయి. అప్పటిదాక ఇల్లంతా సందడి చేసిన ఆ బాలిక, పాముకాటుకు బలికావడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎస్ఐ రమేశ్ వివరాల ప్రకారం.. చందుర్తి మండలం ఆశిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన చేకుట రమేశ్-సుమలత దంపతులకు కొడుకు(4), ఏడాదిన్నర కూతురు వేదాన్షి ఉన్నారు. వ్యవసాయం చేసుకునే రమేశ్, ఆరు నెలల క్రితం గల్ఫ్ వెళ్లాడు. సుమలత తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆశిరెడ్డిపల్లిలోనే ఉంటూ తమకున్న భూమిలో వ్యవసాయం చేస్తున్నది.
శనివారం సాయంత్రం సుమలత ఇంటి పనుల్లో నిమగ్నమై ఉండగా, కూతురు వేదాన్షి ఇంటి ఆవరణలో ఆడుకుంటున్నది. కొద్దిసేపటి తర్వాత ఒక్కసారిగా ఆ చిన్నారి ఏడువడంతో తల్లి బయటికి వచ్చింది. పాము కుట్టినట్టు గుర్తించి, స్థానికుల సాయంతో అంబులెన్స్‌లో వేములవాడలోని ఓ ప్రైవేట్ దవాఖానకు తీసుకెళ్లింది. అక్కడి నుంచి వైద్యుల సూచన మేరకు ఎల్లారెడ్డిపేటలోని ఓ దవాఖానకు తీసుకెళ్తుండగా వేదాన్షి మృతిచెందింది. అప్పటి వరకు కండ్ల ముందర ఆడుకుంటున్న చిన్నారి మృతి చెందడంతో తల్లి బోరున విలపించింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.