Jagityal | జగిత్యాల, నవంబర్ 28 : వయో వృద్ధుల (సీనియర్ సిటిజెన్లు) కోసం ప్రత్యేక జెరియాట్రిక్ వైద్య సేవలు, కన్సల్టేషన్ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా సంక్షేమాధికారి డాక్టర్ బీ నరేష్ కోరారు. ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో వయో వృద్ధుల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన జెరియాట్రిక్ ఉచిత వైద్య సేవల విభాగాన్ని జిల్లా సంక్షేమాధికారి శుక్రవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ ఈ విభాగంలో జెరియాట్రిక్ వైద్యులచే ఉచిత వైద్య పరీక్షలు పూర్తి ఆరోగ్య పరిశీలన, కౌన్సెలింగ్ ఉంటుందన్నారు. సీనియర్ సిటిజెన్స్ జిల్లా అధ్యక్షుడు హరిఅశోక్ కుమార్ మాట్లాడుతూ తమ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పీ నర్సింహా రావు వినతిపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించి రాష్ట్ర వ్యాప్తంగా వృద్ధుల కోసం జెరియాట్రిక్ వార్డులు జిల్లా ప్రభుత్వ అస్పత్రుల్లో ఏర్పాటు చేయడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు.
సీనియర్ సిటిజెన్లకు డయాబెటిస్, రక్తపోటు, గుండె, మూత్రపిండాలు, శ్వాసకోశ సమస్యలు, పక్షవాతం, మధుమేహం వంటి వృద్ధాప్య సంబంధిత వ్యాధులకు ఉచిత చికిత్స పొందవచ్చని, అలాగే ఫిజియోథెరపీ సేవలు కూడా అందుబాటులో ఉంటాయని వివరించారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్వో శ్రీనివాస్, జనరల్ ఆస్పత్రి ఆర్ఎంవో విజయ్ రెడ్డి, సీనియర్ సిటిజెన్స్ జిల్లా అధ్యక్షుడు హరి అశోక్ కుమార్, జిల్లా కార్యదర్శి గౌరి శెట్టి విశ్వనాతం, రిటైర్డ్ జాయింట్ కలెక్టర్ కృష్ణా రెడ్డి, సీనియర్ సిటిజెన్స్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పీ హన్మంత్ రెడ్డి, ఎండీ యాకూబ్, వెలముల ప్రకాష్ రావు, ఎఫ్ఆర్వో కొండయ్య,కరుణ, రాధ,తదితరులు పాల్గొన్నారు.