Ramagiri | రామగిరి, మే 23 : పంట పొలాల వద్ద, రహదారుల వెంబడి ఉన్న ట్రాన్స్ఫార్మర్లలో కాపర్ వైర్లు దొంగిలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను రామగిరి పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.80 వేల విలువైన కాపర్ వైర్, రూ.20 వేల విలువైన ఏసీ ఔటర్, రెండు మోటార్ బైక్‌లు, మూడు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు పెద్దపల్లి డీసీపీ భూక్యా రాంరెడ్డి తెలిపారు. రామగిరి పోలీస్ స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో శనివారం ఆయన వివరాలు వెల్లడించారు. రామగిరి మండలం కల్వచర్ల మారుతి నగర్ హనుమాన్ ఆలయం సమీపంలో దొంగిలించిన సామగ్రిని తరలిస్తున్న సమయంలో సుల్తానాబాద్ మండలం దేవునిపల్లికి చెందిన శీర్ల లచ్చయ్య, మోటం దేవేందర్, మోటం జంపయ్య, మోటం అజయ్‌లను రామగిరి ఎస్సై తాడవేని శ్రీనివాస్ అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వీరంతా దగ్గరి బంధువులే కాగా ప్రస్తుతం రామగిరి మండలం నాగేపల్లి గ్రామంలో నివాసం ఉంటున్నారని పేర్కొన్నారు.
నిందితులు రామగిరి మండలం పన్నూరు జేఎన్టీయూ కళాశాల సమీపం, మంథని అయ్యగారు చెరువు కట్ట, కూచిరాజ్పల్లె, అక్నేపల్లి ప్రాంతాల ట్రాన్స్ఫార్మర్లు, సుల్తానాబాద్ మండలం భూపతిపూర్ ట్రాన్స్ఫార్మర్, అంతర్గాం మండలం కుందనపల్లి పంప్‌హౌస్ వద్ద ట్రాన్స్ఫార్మర్ల నుంచి కాపర్ వైర్లు చోరీ చేసినట్లు విచారణలో వెల్లడైందన్నారు. అదేవిధంగా రామగిరి మండలం కల్వచర్లలోని కృష్ణవేణి పాఠశాల వద్ద ఏసీ ఔటర్‌ను కూడా అపహరించినట్లు తెలిపారు. దొంగిలించిన కాపర్ వైర్లు, ఏసీ ఔటర్‌ను మోటార్ బైక్‌లపై తరలిస్తున్న సమయంలో పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారని చెప్పారు. నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు వెల్లడించారు. దొంగలను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన రామగిరి ఎస్సైలు తాడవేని శ్రీనివాస్, దివ్యతో పాటు సిబ్బంది అభిషేక్, రమేష్, రాజ్‌కుమార్‌లను డీసీపీ, ఏసీపీ అభినందించారు. ఈ సమావేశంలో గోదావరిఖని ఏసీపీ మడత రమేష్ , మంథని సీఐ బొల్లపల్లి రాజు పాల్గొన్నారు.