“జై బోలో గణేశ్ మహారాజ్ కీ” “గణపతి బప్పా మోరియా..” “జైజై వినాయకా” నినాదాలు.. డప్పు చప్పుళ్ల హోరు.. అతివల కోలాటాలు.. యువతీయువకుల నృత్యాలు.. చిన్నారుల కేరింతల మధ్యన గణనాథుడికి ఘనవీడ్కోలు పలికారు. నవరాత్రులు ఘనమైన పూజలందుకున్న గణేశుడిని, సోమవారం విద్యుద్దీపాలతో అలంకరించిన వాహనాల్లో ఉంచి కన్నుల పండువగా శోభాయాత్రలు తీశారు. దారిపొడవునా జనం నీరాజనం పట్టగా, చెరువులు, కాలువల్లో నిమజ్జనం చేశారు. ‘పోయిరా గణపయ్యా పోయిరా’ అంటూ సాగనంపారు. నేడు జగిత్యాల, సిరిసిల్ల జిల్లాలో వీడ్కోలు పలుకనున్నారు.
కరీంనగర్ కమాన్‌చౌరస్తా, సెప్టెంబర్ 16 : వినాయక నవరాత్రోత్సవాల్లో భాగంగా ఆఖరి రోజైన సోమవారం ఉదయం నుంచే మండపాల వద్ద ఉద్వాసన పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం ఆయా ఉత్సవ కమిటీల సారథ్యంలో వాహనాలను విద్యుద్దీపాలతో, రంగురంగుల పూలతో సుందరంగా అలంకరించి గణేశ్ విగ్రహాలను నిలిపారు. డప్పు చప్పుళ్ల హోరు, యువతీయువకుల నృత్యాలు, మహిళల కోలాటాలు, పిల్లల కేరింతల నడుమ నిమజ్జన యాత్రలను కొనసాగించారు.
కరీంనగర్లో ఏర్పాటు చేసిన ప్రతిమలను టవర్ సరిల్, రాంనగర్ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన నిమజ్జనోత్సవ వేదికల ద్వారా పూజలు జరిపి మానకొండూర్, కొత్తపల్లి, చింతకుంట జలాశయాల్లో నిమజ్జనం చేశారు. కాగా, కరీంనగర్‌లోని ఒకటో నంబర్ గణనాథుడికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, మేయర్ వై సునీల్‌రావు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం టవర్ వద్దకు చేరుకుని వీహెచ్‌పీ నాయకులతో కలిసి పూజలు చేశారు. ఇక్కడ సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపరాణి హరిశంకర్, కలెక్టర్ పమేలా సత్పతి, సీపీ అభిషేక్ మహంతి, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.