జగిత్యాల, సెప్టెంబర్ 17 : నవరాత్రులు పూజలందుకున్న గౌరీ సుతుడు గంగమ్మ ఒడిలోకి చేరాడు. జిల్లా వ్యాప్తంగా గణేశ్ నిమజ్జన వేడుకలు మంగళవారం వైభవంగా జరిగాయి. భక్తుల ఆటపాటలు, వివిధ వేషధారణలతో ‘జై బోలో గణేశ్ మహరాజ్ కి జై’ అనే నినాదాలతో కోలాహలంగా నిర్వహించారు. మండపాల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత ఆనందోత్సాహాల మధ్య, అందంగా అలంకరించిన వాహనాల్లో గణపతులను నిర్వాహకులు నిమజ్జనానికి తరలించారు.
కొన్ని చోట్ల సోమవారమే నిమజ్జనం చేయగా, మంగళవారం సైతం నిమజ్జన వేడుకలు కొనసాగాయి. అధికార యంత్రాంగం భారీ క్రేన్లను ఏర్పాటు చేసి భక్తులకు ఇబ్బందులు కలుగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ నేతృత్వంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. కోరుట్లలో శోభాయాత్రను ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల జెండా ఊపి ప్రారంభించారు.