Funds sanctioned | ధర్మారం, సెప్టెంబర్ 17: ధర్మారం మండలంలోని పలు గ్రామాలలో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ప్రభుత్వం ద్వారా నిధులు మంజూరైనట్లు రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ,మైనార్టీ, దివ్యాంగుల శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. ధర్మారం వ్యవసాయ మార్కెట్ యార్డ్ కు వచ్చిన మంత్రి లక్ష్మణ్ కుమార్ అభివృద్ధి పనులకు మంజూరైన వివరాలను బుధవారం విలేకరులకు వెల్లడించారు. అంతకుముందు కొన్ని నెలల క్రితం ప్రమాదవశాత్తు లారీ పైనుంచి పడి హమాలీ మేడవేని రాజేశం మృతిచెందగా వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ద్వారా మంజూరైన రూ.1 లక్ష చెక్కును మృతుడి కుటుంబ సభ్యులకు అందజేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డ్ చదును చేయడానికి రూ.28 లక్షలు, అదనపు షెడ్డు నిర్మాణానికి రూ.1 కోటి 40 లక్షలు నిధులు మంజూరు అయినట్లు ఆయన వివరించారు. ధర్మారం మండల కేంద్రంలోని తెనుగువాడ నుంచి ఎండపల్లి క్రాస్ రోడ్డు వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి రూ.3 కోట్ల 20 లక్షల నిధులు పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ శాఖ ద్వారా మంజూరైనట్లు ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా డి ఎం ఎఫ్ టి గ్రాంట్ ద్వారా నంది మేడారంలోని మహిళా సంఘం భవన నిర్మాణానికి రూ. 10 లక్షలు, ధర్మారంలో ఎస్సీ కమ్యూనిటీ భవన నిర్మాణానికి రూ.5 లక్షలు, ధర్మారంలో యాదవ సంఘం భవనం ప్రహరి గోడ నిర్మాణానికి నిధులు మంజూరైనట్లు తెలిపారు.
పద్మశాలి కమ్యూనిటీ భవనం, మండల యాదవ సంఘం భవనం, మున్నూరు కాపు సంఘ భవనం, నాయి బ్రాహ్మణ కమ్యూనిటీ భవనం నిర్మాణాలకు ఒక్కోదానికి రూ.5 లక్షల చొప్పున, అదేవిధంగా చామనపల్లిలో మల్లికార్జున స్వామి గుడి కి సిసి రోడ్డు నిర్మాణం, రచ్చపల్లిలో పద్మశాలి సంఘ భవనం, మల్లాపూర్ లో మున్నూరు కాపు సంఘ భవనం, నరసింహులపల్లిలో యాదవ సంఘం భవనం, దొంగతుర్తి లో మాదిగ కమ్యూనిటీ భవనం, మున్నూరు కాపు సంఘ భవనం, పత్తిపాక లో ఎస్సీ కమ్యూనిటీ భవనం, అబ్బాపూర్ లో యాదవ్ కమ్యూనిటీ భవన నిర్మాణాలకు ఒక్కో దానికి రూ.5లక్షలు చొప్పున మంజూరయ్యాయన్నారు. ఖిలావనపర్తి లో శ్రీ లక్ష్మీనరసింహస్వామి గుడికి అనుబంధంగా కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి రూ.15 లక్షల చొప్పున నిధులు మంజూరైనట్లు ఆయన వివరించారు. ఆయన వెంట ఏఎంసీ చైర్మన్ లావుడియా రూప్ల నాయక్, వైస్ చైర్మన్ అరిగే లింగయ్య, డైరెక్టర్లు, మార్కెట్ కార్యదర్శి సరోజ తదితరులు పాల్గొన్నారు.