Peddapally | పెద్దపల్లి, ఆగస్టు 21(నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, లేనిపక్షంలో సమ్మెకు దిగుతామని ఆటో డ్రైవర్లు, ఓనర్ల జేఏసీ నాయకులు హెచ్చరించారు. హామీల అమలును డిమాండ్ చేస్తూ తెలంగాణ ఆటో డ్రైవర్లు, ఓనర్ల జేఏసీ ఆధ్వర్యంలో పెద్దపల్లిలో శుక్రవారం భారీ ర్యాలీ నిర్వహించారు. పెద్దపల్లి బస్టాండ్ నుంచి కలెక్టరేట్ వరకు సుమారు 300 ఆటోలతో భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహించి, ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షకు వినతిపత్రం అందజేశారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆటో డ్రైవర్లు, ఓనర్ల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు మంద రవి కుమార్ యాదవ్, పెద్దపల్లి జిల్లా ఆటో జేఏసీ గౌరవ అధ్యక్షుడు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వ్యాళ్ల హరీష్ రెడ్డితో పాటు పలువురు ఆటో డ్రైవర్లు, ఓనర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. మహాలక్ష్మి పథకం కారణంగా ఆటో డ్రైవర్లు ఉపాధి కోల్పోయి తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అభయహస్తం మేనిఫెస్టోను బైబిల్, ఖురాన్తో పోల్చి చెప్పినప్పటికీ, హామీలను అమలు చేయకుండా ఆటో డ్రైవర్లను మోసం చేసిందని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, ముఖ్యంగా ఏటా రూ.12 వేల ఆర్థిక సహాయం అందిస్తామని ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు.
హామీల అమలు విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఆటో డ్రైవర్ల సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే ఈ నెల 24వ తేదీ నుంచి నిరవధిక సమ్మె చేపడతామని జేఏసీ నాయకులు స్పష్టం చేశారు. అదే రోజు రాష్ట్రంలోని జాతీయ రహదారులను దిగ్బంధం చేస్తామని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆటో డ్రైవర్లతో పాటు వివిధ వర్గాలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని నాయకులు ఆరోపించారు. మహాలక్ష్మి పథకం ప్రభావంతో లక్షలాది మంది ఆటో డ్రైవర్లు ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. తమ సమస్యలను పరిష్కరించకపోతే ఈ నెల 24 నుంచి నిరవధిక సమ్మెకు దిగడం ఖాయమని స్పష్టం చేశారు.