Vemulawada | వేములవాడ రూరల్, డిసెంబర్ 12: ఈ రోజుల్లో స్నేహితుడంటే మందు కొట్టామా.. ఉదయానికల్లా మర్చిపోయామా..? అనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కానీ ఒక ప్రాణ స్నేహితుడు చనిపోతే అతడి కుటుంబానికి బాసటగా నిలిచిన వేములవాడ మున్సిపల్ పరిధిలోని శాత్రాజ్ పల్లి లో చిన్ననాటి స్నేహితులు వ్యవహరించిన తీరు ప్రస్తుతం అభినందనీయంగా మారింది. ఇటీవల వనపర్తి మహేందర్ (39) అకస్మాత్తుగా గుండెపోటుతో మృతి చెందాడు. మృతుడు మహేందర్ కు భార్య సుమశ్రీ, కూతురు శ్రీనిధి, కుమారుడు శ్రీహన్ ఉన్నారు. ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తుండగా వారి కుటుంబ పరిస్థితులను చూసిన స్నేహితులు, గ్రామస్తులు తమ ఔధార్యాన్ని చాటుకున్నారు.
కూతురు శ్రీనిధి ఉజ్వల భవిష్యత్‌కు వారంతా ఒక్కటై రూ.2 లక్షల నగదును పోగు చేసి కూతురుపై ఫిక్స్ డిపాజిట్ చేసి ఆమె చదువులు ఇతర అవసరాలకు వినియోగించే విధంగా వాడుకోవాలని మృతుని భార్య సుమశ్రీ కి శుక్రవారం అందజేశారు. పదో తరగతి స్నేహితులతో మొదలుకొని, సుభాష్, రెడ్డి యూత్ క్లబ్ సభ్యులు, సింగపూర్ మిత్రమండలి తో కలిపి సన్నిహితులు ఈ గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం అభినందనీయంగా మారింది.
స్నేహితుడంటే మన మధ్యలో లేకపోయినా ఆయనకు మంచి చేయాలనే సంకల్పంతో వారు చేసిన పనిని పలువురు హర్షిస్తున్నారు. ఈ కార్యక్రమంలో కేడీసీసీ డైరెక్టర్ ఏనుగు తిరుపతిరెడ్డి, బార్ అసోసియేషన్ అధ్యక్షులు గుడిసె సదానందం, మాజి ఉప సర్పంచ్ నల్ల సతీష్ రెడ్డి, సుభాష్ యూత్ అధ్యక్షులు విక్కుర్తి సాయి, అయిత వెంకన్న, కొట్టాల కార్తీక్, మిట్టపెల్లి సునీల్, సుదవేని నరేష్, బూర శివ, బండి అనిల్, తదితరులున్నారు.