కొత్తపల్లి, ఏప్రిల్ 29: జిల్లా యువజన, క్రీడాశాఖ, కరీంనగర్ బల్దియా సహకారంతో ప్రతి సంవత్సరం నగరంతో పాటు జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉచిత వేసవి శిక్షణ శిబిరాల(సమ్మర్ క్యాంప్)ను ఐదేళ్లుగా నిర్వహిస్తున్నారు. కరీంనగర్ జిల్లాను క్రీడాహబ్‌గా తీర్చిదిద్దేందుకు బల్దియా అధికారులు, క్రీడాశాఖాధికారులు, క్రీడా సంఘాల బాధ్యులు తమవంతు కృషి చేస్తున్నారు. హైదరాబాద్‌కు ధీటుగా జిల్లా కేంద్రంలో ప్రతి సంవత్సరం రాష్ట్ర, జాతీయస్థాయి క్రీడా పోటీలను నిర్వహిస్తూ క్రీడాకారులకు తమవంతు సహకారం అందిస్తుండడంతో పాటు విద్యార్థులు క్రీడలపై దృష్టిసారించేలా ప్రోత్సహిస్తున్నారు. రాష్ట్రంలోనే కరీంనగర్‌ను స్పోర్ట్స్‌లో రోల్ మోడల్‌గా తీర్చిదిద్దేందుకు వేసవి క్రీడా శిక్షణ శిబిరాల నిర్వహణకు కరీంనగర్ నగరపాలక సంస్థ ముందుకు రావడం, అవి విజయవంతం కావడంతో మరోసారి శిబిరాల నిర్వహణకు క్రీడాశాఖ, నగరపాలక సంస్థ అధికారులు సమాయత్తమవుతున్నారు. వీటికి తోడు జిల్లా యువజన, క్రీడాశాఖ ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతాల్లో వేసవిలో ఉచిత శిక్షణ శిబిరాల నిర్వహణకు కోచ్‌లు, సీనియర్ క్రీడాకారులు, పీఈటీలు, పీడీల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది.
కలెక్టర్ ఆదేశాల మేరకు గ్రామీణ ప్రాంతాల్లో మే ఒకటి నుంచి 31వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా 10 కేంద్రాల్లో వేసవి ఉచిత శిక్షణ శిబిరాలు నిర్వహించేందుకు క్రీడాశాఖ అధికారులు ఏర్పాటు చేశారు. 14 ఏళ్లలోపు బాలబాలికలకు ఈ పలు క్రీడాంశాల్లో శిక్షణలు ఇవ్వనున్నారు. అలాగే, కరీంనగర్ నగరపాలక సంస్థ, జిల్లా యువజన క్రీడా శాఖ ఆధ్వర్యంలో మే 6 నుంచి స్థానిక అంబేద్కర్ స్టేడియంలో సమ్మర్ క్యాంపును ప్రారంభించి నెల రోజుల పాటు చిన్నారులకు వివిధ క్రీడాంశాల్లో శిక్షణ ఇవ్వనున్నారు. ఇందుకు సంబంధించి చిన్నారుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.
నగరపాలక సంస్థ సహకారంతో నిర్వహించే సమ్మర్ క్యాంపులో చిన్నారులకు పౌష్టికాహారం అందజేస్తున్నారు. ప్రతి రోజు గుడ్డు, పాలు, అరటి పండ్లను అందజేస్తూ చిన్నారుల్లో ఉత్తేజాన్ని నింపడంతో పాటు క్రీడలపై దృష్టిసారించేలా ప్రోత్సహిస్తున్నారు. గతేడాది నిర్వహించిన సమ్మర్ క్యాంపులో సుమారు 3 వేల నుంచి 3500 బాలబాలికలు పాల్గొనగా వారికి క్రికెట్, హాకీ, ఫుట్‌బాల్, బాసెట్బాల్, బాక్సింగ్, జూడో, అథ్లెటిక్స్, యోగా, సేటింగ్, రెజ్లింగ్, జిమ్నాస్టిక్స్, వుషు, కిక్ బాక్సింగ్, వాలీబాల్, చదరంగం, సాఫ్ట్‌బాల్, బ్యాడ్మీంటన్, కెనోయింగ్ వంటి క్రీడల్లో శిక్షణ ఇచ్చారు. ఈ సారి ఎక్కువ మంది చిన్నారులు వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అందుకు ఏర్పాట్లు కూడా చేస్తున్నట్లు వెల్లడించారు.
దరఖాస్తులు స్వీకరిస్తున్నం
కలెక్టర్ ఆదేశాల మేరకు గ్రామీణ ప్రాంతాల్లో 10 కేంద్రాలను ఏర్పాటు చేసి ఉచిత వేసవి శిక్షణ శిబిరాలు నిర్వహించేందుకు అర్హులైన కోచ్‌లు, సీనియర్ క్రీడాకారులు, పీఈటీలు, పీడీల నుంచి దరఖాస్తులు తీసుకుంటున్నం. ఇప్పటికే పలువురు కోచ్‌లు శిక్షణ శిబిరాలు నిర్వహిస్తామని దరఖాస్తులు అందజేశారు. మే ఒకటి నుంచి 31 వరకు పలు క్రీడాంశాల్లో ఉచిత వేసవి శిక్షణ శిబిరాలు జరుగనున్నాయి. 14 ఏళ్లలోపు బాలబాలికలు ఈ శిబిరాల్లో క్రీడా శిక్షణ పొందవచ్చు. ప్రతి సంవత్సరం మాదిరిగానే నగరపాలక సంస్థ సహకారంతో సమ్మర్ క్యాంపుల నిర్వహణకు ఇప్పటికే చర్యలు చేపట్టాం. నగరంలోని అంబేద్కర్ స్టేడియంలో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో జిల్లా యువజన క్రీడాశాఖ, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ సహకారంతో వేసవి శిక్షణ శిబిరం విజయవంతంగా నిర్వహిస్తాం.
– కీర్తి రాజవీరు, జిల్లా యువజన, క్రీడాశాఖాధికారి