రాంనగర్, అక్టోబర్ 16 : పెట్రోల్ బంకుల్లో రోజురోజుకూ మోసాలు పెరిగిపోతున్నాయి. ఇటీవల హైదరాబాద్, సూర్యపేట, నల్లగొండ, సిద్దిపేట ప్రాంతాల్లో ఘటనలు వెలుగు చూశాయి. వాహనదారులు అప్రమత్తంగా ఉంటే మోసాల బారినపడకుండా ఉండొచ్చు.. కానీ, ఏమరుపాటుతో మోసపోయే సందర్భాలెన్నో ఉన్నాయి. మోసాలను గుర్తించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తూనికలు, కొలతలశాఖ అధికారులు సూచిస్తున్నారు.
మోసాలను పసిగట్టండి ఇలా..
బంక్‌లో పెట్రోల్ కొట్టడం ప్రారంభించగానే 1,2,3 రీడింగ్ కనిపించకుండా నేరుగా 5,6,7,8కు జంప్ అవుతుందట. దీంతో రావాల్సిన పెట్రోల్ కన్నా తకువగా వస్తుంది.
మాటల్లో పెట్టి తకువ ఇంధనం నింపి, ఎకువ డబ్బులు వసూలు చేస్తుంటారు. రూ.100 పెట్రోల్ అడిగితే అటెండెంట్ అంతకుముందు కొట్టిన రూ.50రీడింగ్ నుంచి ప్రారంభిస్తాడు. దీంతో కేవలం రూ.50 ఇంధనాన్ని మాత్రమే పొందుతారు. ఇది షార్ట్ ఫ్యూయలింగ్ మోసం.
కార్లలో ఇంధనం నింపుకొనేవారు వాహనం కిందకు దిగరు. దీంతో రీడింగ్ మార్చకుండానే ఫిల్ చేస్తుంటారు. ఎప్పుడు పెట్రోల్ కొట్టించినా కారు దిగి మీటర్ దగ్గరికి వెళ్లి పోయించుకోవాలని సూచిస్తున్నారు.
పెట్రోల్ పోసే వ్యక్తి మిషన్‌ను తరచుగా నిలిపివేస్తుంటే మోసం చేస్తున్నట్టుగానే భావించాలి. మిషన్ వేగంగా పనిచేస్తున్నా ఇంధనం తక్కువగా వచ్చే అవకాశం ఉం టుంది. అనుమానం వస్తే పెట్రోల్‌ను పరీక్షించాలని బంక్ యజమానులను డిమాండ్ చేయాలి.
రూ.100,200,500,1000 ఇలా రౌండ్‌ఫిగర్‌గా పెట్రోల్‌ను పోయించుకోవడంతో సులభంగా మోసం చేస్తారు. వీలైనంత వరకు రౌండ్‌ఫిగర్‌గా ఫ్యూయల్ కొట్టించుకోకూడదు.
డిజిటల్ మీటర్లు ఉన్న పెట్రోల్ బంకుల్లో కొట్టించుకోవడం ఉత్తమం.
మెషీన్, మీటర్ పూర్తిగా ఆగిన తర్వాతే ట్యాంక్ నుంచి నాజిల్‌ను బయటికి తీయాలని అటెండెంట్‌కు ముందుగానే చెప్పాలి.
పెట్రోల్ కల్తీ అయినట్టు అనుమానం వస్తే వెంటనే లిట్మస్ పేపర్‌తో పరీక్షించాలి. వినియోగదారుల రక్షణ చట్టం 1986 ప్రకారం.. బంకు యాజమాన్యం లిట్మస్ పేపర్లను అందుబాటులో ఉంచాలి. లిట్మస్ పేపర్‌పై కొన్ని చుకల పెట్రోల్ పోస్తే అది పూర్తిగా ఆవిరైన తర్వాత ఎలాంటి మరకలూ కనిపించకపోతే అది స్వచ్ఛమైన పెట్రోల్‌గా, మరకలు ఉంటే అది కల్తీ పెట్రోల్‌గా నిర్ధారించుకోవాలి.
బంక్ వాళ్లు మోసం చేస్తే..
పెట్రోల్ బంకుల్లో జరిగే మోసాలపై పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ లేదా సంబంధిత ఆయిల్ కంపెనీ వెబ్సైట్లోనూ ఫిర్యాదు చేయవచ్చు. బంకుల్లో ఉండే కంప్లయింట్ బుక్‌లోనూ ఫిర్యాదును రిజిస్టర్ చేయవచ్చు. ఆడిట్, తనిఖీల సమయంలో వాటిని సమీక్షిస్తుంటుంది.