మానకొండూరు : మోటర్ బైకులపై వెళ్తున్న వారిపై మార్గమధ్యంలో తేనెటీగలు(Bee attack) జరిపిన దాడిలో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. 108 సిబ్బంది తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తాడికల్ గ్రామంలోని ఒకే కుటుంబానికి చెందిన దుబ్బాక నరసయ్య అతని భార్య రజిత, కుమార్తె సమ్మెట శ్రీజ, అల్లుడు సమ్మెట మహేందర్ కలిసి రెండు బైకులపై నల్లగొండ జాతరకు బయలుదేరారు. మార్గమధ్యంలో గట్టు దుద్దెనపల్లి కాల్వ వద్దకు రాగానే ఒక్కసారిగా తేనెటీగల గుంపు బైక్‌పై వెళ్తున్న వారిపై దాడి చేసింది.
ఈ ఘటనలో నరసయ్య, మహేందర్‌కు తీవ్ర గాయాలు కాగా, రజిత, శ్రీజకు స్వల్ప గాయాలు అయ్యాయి. అటుగా వెళ్తున్న ప్రయాణికులు 108 కి సమాచారం ఇవ్వడంతో 108 ఈఎంటి గూడూరి సతీష్ రెడ్డి, పైలెట్ నర్రా సదన్ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని అంబులెన్స్ లో ప్రథమ చికిత్స అందించారు. అనంతరం హుజురాబాద్ ప్రభుత్వ దవఖానకు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.