Peddi | గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దర్శకుడు బుచ్చిబాబు సన తెరకెక్కించిన భారీ చిత్రం ‘పెద్ది’ విడుదలకు ముందు నెలకొన్న అనిశ్చితి ఎట్టకేలకు తొలగిపోయింది. గత కొన్ని రోజులుగా టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారిన థియేటర్ల వివాదానికి తెరపడింది. ముఖ్యంగా దిల్ రాజు సంస్థకు చెందిన ఎస్వీసీ థియేటర్లలో ‘పెద్ది’ విడుదల అవుతుందా లేదా అనే సందేహాలకు ఇప్పుడు స్పష్టత వచ్చింది. తెలుగు సినీ పరిశ్రమలో నిర్మాతలు, ఎగ్జిబిటర్ల మధ్య రెంటల్ సిస్టమ్, పర్సెంటేజ్ సిస్టమ్ అంశాలపై నెలకొన్న విభేదాలు ‘పెద్ది’ విడుదలపై ప్రభావం చూపుతాయనే ప్రచారం జరిగింది. మరోవైపు ఎస్వీసీ డిస్ట్రిబ్యూషన్ మరియు మైత్రి డిస్ట్రిబ్యూషన్ మధ్య ఉన్న విభేదాల కారణంగా కూడా సినిమా విడుదలపై అనేక ఊహాగానాలు వినిపించాయి. ఆదివారం విడుదల చేసిన నైజాం థియేటర్ల తొలి జాబితాలో ఎస్వీసీ థియేటర్ల పేర్లు లేకపోవడంతో ఈ ప్రచారానికి మరింత బలం చేకూరింది.
అయితే తాజాగా జరిగిన చర్చల అనంతరం అన్ని సమస్యలు పరిష్కారమయ్యాయి. నైజాం ప్రాంతంలోని ఎస్వీసీ సంస్థకు చెందిన ప్రధాన థియేటర్లలో ‘పెద్ది’ ప్రదర్శనకు అంగీకారం కుదిరినట్లు సమాచారం. దీంతో దిల్ రాజు థియేటర్లలో కూడా ‘పెద్ది’ విడుదల ఖాయమైంది. ఈ నిర్ణయం రామ్ చరణ్ అభిమానులకు భారీ ఊరటనిచ్చింది. ప్రత్యేకంగా నిజామాబాద్‌లోని ప్రధాన స్క్రీన్లతో పాటు హైదరాబాద్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ప్రాంతంలోని సుదర్శన్, దేవి థియేటర్ కాంప్లెక్స్‌లలో కూడా ‘పెద్ది’ విడుదల కానుండటం విశేషం. ఈ థియేటర్లు భారీ సినిమాల విడుదలలకు కేంద్ర బిందువుగా నిలుస్తుంటాయి. ఇప్పుడు ‘పెద్ది’ కూడా అక్కడ విడుదల కానుండటంతో సినిమా ఓపెనింగ్స్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇప్పటివరకు మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన చిత్రాల్లో నైజాం ప్రాంతంలో ఇంత భారీ స్థాయిలో విడుదల అవుతున్న సినిమా ‘పెద్ది’నే అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. గతంలో మైత్రి సంస్థ సినిమాలకు లభించని స్థాయిలో స్క్రీన్లు ఈ చిత్రానికి దక్కినట్లు తెలుస్తోంది. దీంతో విడుదల రోజు నుంచే భారీ వసూళ్లు నమోదు చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మరోవైపు తెలంగాణలో టికెట్ ధరల పెంపు, అదనపు షోల అనుమతుల కోసం నిర్మాతలు ప్రభుత్వాన్ని ఆశ్రయించినట్లు సమాచారం. ఈ విషయంపై ప్రభుత్వం నుంచి అనుమతులు లభిస్తే ‘పెద్ది’కి మరింత భారీ అడ్వాంటేజ్ లభించే అవకాశం ఉంది. ముఖ్యంగా మొదటి వారం వసూళ్లపై దీని ప్రభావం స్పష్టంగా కనిపించనుంది. ఈ ఏడాది వేసవి సీజన్లో టాలీవుడ్ నుంచి పెద్ద సినిమా లేకపోవడంతో బాక్సాఫీస్ ఆశించిన స్థాయిలో సందడి చేయలేకపోయింది. అలాంటి సమయంలో భారీ అంచనాలతో వస్తున్న ‘పెద్ది’పై ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది