Vemulawada | వేములవాడ, ఆగస్టు 3 : వేములవాడ పురపాలక సంఘం పరిధిలో నిషేధిత జాబితాలో ఉన్న భూములలో మున్సిపల్ అధికారులు నిర్మాణ అనుమతులు ఇవ్వడం పై మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ రామతీర్థపు మాధవిరాజు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆమె సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ గరీమ అగ్రవాల్ కు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. వేములవాడ పట్టణంలోని జగిత్యాల బస్టాండ్ సమీపంలో ప్రోసిడింగ్ జీ2/2256/2022 ఉత్తర్వుల ద్వారా 20 ఎకరాల 20 గుంటలలో ఎలాంటి అనుమతులు ఇవ్వరాదని సంబంధిత శాఖలకు కలెక్టర్ కార్యాలయం నుండి ఆదేశాలు కూడా ఉన్నాయని చెప్పారు.
నిషేధ జాబితాలో ఉన్నప్పటికీ 01-05-2026, 23-06-2026 తేదీలలో తోట్ల లక్ష్మి, మ్యాకల లచ్చయ్య అనే ఇద్దరికీ పట్టణ ప్రణాళిక అధికారులు నిర్మాణ అనుమతులను జిల్లా కలెక్టర్ ఆదేశాలను పాటించకుండా అక్రమంగా జారీ చేశారని ఆమె ఆరోపించారు. అలాగే 26-08-2020 లోపు రిజిస్ట్రేషన్లు ఉన్న భూ యజమానులకు మాత్రమే భవన నిర్మాణానికి అనుమతులు ఇవ్వాల్సి ఉండగా ఇందులోనూ కటాఫ్ డేట్ మున్సిపల్ రాష్ట్ర అధికారుల నుండి నిబంధన ఉన్న, ఆ తర్వాత రిజిస్ట్రేషన్ అయిన వాటికి అక్రమంగా నిర్మాణ అనుమతులు ఇచ్చారని ఫిర్యాదులో పేర్కొన్నట్టు తెలిపారు. వేములవాడ పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు ప్రభుత్వ నియమ నిబంధనలు పాటించకుండా విచ్ఛలవిడిగా అనుమతులు ఇస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.