రాజన్న సిరిసిల్ల, డిసెంబర్ 7 (నమస్తే తెలంగాణ) : ఏడాది గడుస్తున్నా కాంగ్రెస్ సర్కారు పెండింగ్ బిల్లులు ఇవ్వడం లేదని, సర్కారుపై ఒత్తిడి తీసుకువచ్చి ఇప్పించేలా చూడాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు సిరిసిల్ల జిల్లాకు చెందిన మాజీ సర్పంచులు మొరపెట్టుకున్నారు. శనివారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో సర్పంచుల ఫోరం జేఏసీ జిల్లా అధ్యక్షుడు అక్కెనపెల్లి కరుణాకర్ ఆధ్వర్యంలో 50 మంది ఆయనకు వినతిపత్రం అందజేశారు.
గ్రామాల అభివృద్ధి కోసం చేసిన పనులు, వివరాలు తెలుపుతూ ప్రభుత్వం నుంచి రావాల్సిన బిల్లులు ఇప్పించాలని కోరగా, కేటీఆర్ సానుకూలంగా స్పందించారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, చర్చిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కరుణాకర్ మాట్లాడుతూ, పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని ఏడాదిగా ప్రభుత్వానికి పదేపదే విజ్ఞప్తి చేసినా ఫలితం లేదని, అనేక పోరాటాలు చేసినా ప్రభుత్వంలో చలనం లేకపోవడం దురదృష్టకరమని వాపోయారు.
సకాలంలో బిల్లులు రాక చాలా మంది తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారని, అప్పుల బాధ తాళలేక కొందరు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారి వెంట ప్రధాన కార్యదర్శి దుమ్మ అంజయ్య, సలహాదారులు చాకలి రమేశ్, బొజ్జం మల్లేశం, గంగాధర్, మల్యాల దేవయ్య, గున్నాల లక్ష్మణ్, కోల నర్సయ్య, ఆరె మహేందర్, గాండ్ల సుమతి, తాడెపు ఎల్లం తదితరులు పాల్గొన్నారు.